హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడంతో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి మైనింగ్ లో అవకతవకలు పాల్పడడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. మహిపాల్ రెడ్డికి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ఎదుట బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసుల వాహనాలను బిఆర్ఎస్ కార్యకర్తలు, మహిపాల్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
మధుసూదన్ రెడ్డికి సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ కంపెనీ ఉంది. లక్డారంలో పరిమితికి మించి సదరు కంపెనీ మైనింగ్ చేసిందని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. నాలుగు ఎకరాలు లీజుకు తీసుకొని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. పొల్యూషన్, మైనింగ్ రూల్ పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్ చేయడంతో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌పై చీటింగ్, మైనింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. గతంలో మహిపాల్ రెడ్డి తమ్ముడు అవినీతికి పాల్పడినట్టు స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపణలు చేశారు.