పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్‌లు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారిద్దరికి ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్‌లో పలువురు కార్పొరేటర్లు వారి అనుచరులు చేరారు. అయితే మహిపాల్‌రెడ్డి చేరికను కొన్ని రోజులుగా పటాన్ చెరు నేతలు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధులు అడ్డుకుంటుండడంతో పిసిసి అగ్రనేతలు వారికి భరోసా ఇచ్చారు.
మహిపాల్ రెడ్డి చేరికతో ఎలాంటి ఇబ్బందులు కలగవని సిఎం రేవంత్ వారికి భరోసా ఇవ్వడంతో మహిపాల్ రెడ్డి చేరికకు మార్గం సుగమమం అయ్యింది. సోమవారం సాయంత్రం పటాన్ చెరు నుంచి భారీ ర్యాలీగా సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి గూడెం మహిపాల్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. గూడెం మహిపాల్ రెడ్డి బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కారుదిగిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఇప్పటివరకు బిఆర్‌ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.