Sunday, January 19, 2025

పతంజలి ఆయర్వేద కేసు క్షమాపణలకే పరిమితం కాదు

- Advertisement -
- Advertisement -

విచారణ పరిధిని విస్తరించిన సుప్రీంకోర్టు
ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న వ్యాపార ప్రకటనలు
ఎఫ్‌ఎంసిజి వ్యాపార ప్రకటనలపై వివరణ ఇవ్వండి
3 కేంద్ర మంత్రిత్వ శాఖలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద కేసులో తన విచారణ పరిధిని మంగళవారం విస్తరించిన సుప్రీంకోర్టు ఎఫ్‌ఎంసిజి(ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు ఇస్తున్న తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించడంతోపాటు వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎఫ్‌ఎంసిజి కంపెనీల వ్యాపార ప్రకటనలను అడ్డుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు మంత్రిత్వశాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు ఇచ్చినందుకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ దాదాపు 67 దినపత్రికలలో ప్రకటనలు ఇచ్చామని పతంజలి ఆయుర్వేద సంస్థకు చెందిన యోగా గురు రాందేవ్, ఆయన సహాయకుడు బాలకృష్ణ సుప్రీంకోర్టుకు మంగళవారం తెలియచేశారు.

మరికొన్ని పత్రికలలో కూడా క్షమాపణ ప్రకటనలు ఇవ్వడానికి తాము సిద్ధమని వారు తెలియచేశారు. వ్యాపార ప్రకటనలు ఇచ్చిన పరిమాణం(అక్షరాల సైజు)లోని క్షమాపణలు కూడా ఇచ్చారా అని జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తమ వద్ద పత్రికలకు సంబంధించిన ప్రతులు రికార్డులో లేవని తెలియచేసిన న్యాయమూర్తులు రెండు రోజుల్లో వాటిని తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది.అంతకుముందు పతంజలి కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కేసు పతంజలి ఆయుర్వేదకు మాత్రమే పరిమితమైనది కాదని, చిన్న పిల్లలు, స్కూలుకు వెళ్లే విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడానికి కారణమైన తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనలు జారీచేస్తున్న ఎఫ్‌ఎంసిజిలకు దీని పరధిని విస్తరిస్తున్నామని తెలిపింది.

డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం, వినియోగదారుల పరిరక్షణ చట్టంతోపాటు తదితర చట్టాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము ప్రత్యేకంగా ఒక సంస్థనో లేక వ్యక్తులనో లేదా ఏజెన్సీనో లక్షంగా చేసుకోవడానికి ఇక్కడ విచారణ జరపడం లేదని, వినియోగదారుల విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించి ప్రజలు తప్పుదారి పట్టకుండా నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో తెలుసుకోవలసి అవసరం ఉందని ధర్మాసనం తెలిపింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించే చట్టాల దురినియోగాన్ని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్ర వినిమయ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతేగాక డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ రూల్స్, 1945లోని 170 నిబంధన కింద ఎటువంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన లైసెనన్సింగ్ సంస్థలకు, ఆయుష్ డ్రగ్ కంట్రోలర్లకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ 2023 ఆగస్టులో రాసిన లేఖపై కేంద్రం నుంచి ధర్మాసనం వివరణ కోరింది. దీంతోపాటు ముందు తన తప్పిదాలను సరిదిద్దుకోవాలంటూ పతంజలి సంస్థ వ్యాపార ప్రకటనలపై పిటిషన్ వేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ)ను ధర్మాసనం ఆదేశించింది. అత్యంత ఖరీదైన మందులు రాస్తూ ఖరీదైన చికిత్స అందచేస్తున్న ఐఎంఎ సభ్యుల అనైతిక చర్యలపై తమకు అనేక ఫిర్యాదులు అందాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణలో తమకు సహాయపడేందుకు వీలుగా నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసి) కూడా ఇంప్లీడ్ కావాలని ధర్మాసనం ఆదేశించింది.

అంతకుముందు..బాబా రాందేవ్, పతంజలి ఆయర్వేద మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తాము తమ తప్పిదాలకు బేషరతుగా క్షమాపణ చెబుతూ సోమవారం పత్రికా ప్రకటన జారీచేశామని ధర్మాసనానికి తెలిపారు. ఎక్కడ? ఎందుకు ఫైల్ చేయలేదు అంటూ ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా 67 వార్తాపత్రికలలో సోమవారం నాడే ప్రకటనను జారీచేశామని రోహత్గీ తెలిపారు. బహిరంగ క్షమాపణ చెప్పడానికి వారం రోజుల సమయం ఎందుకు పట్టిందని న్యాయమూర్తులు ప్రశ్నించగా ఇతర భాషలలోకి అనువదించాల్సి వచ్చిందని రోహత్గీ జవాబిచ్చారు. అయితే ప్రకటనల సైజు గురించి కూడా ఆయనను న్యాయమూర్తులు ప్రశ్నించారు. వార్తాపత్రికలకు సాధారణంగా మీరు ఇచ్చే ప్రకటనల సైజులోనే ఇది కూడా ఉంటుందా అని వారు ప్రశ్నించగా కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సీనియర్ న్యాయవాది తెలిపారు. క్షమాపణను ముద్రించిన పత్రికలను తమ ఎదుట ఉంచాలని న్యాయమూర్తులు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News