కరాచీ : పాక్ పాలు పోసి పెంచిన మరో ఉగ్రనాగు హతమైంది. పఠాన్‌కోట్ దాడి వ్యూహకర్తగా భావిస్తున్న జైషే మహ్మద్ టాప్ కమాండర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తమ దేశంలో వరుసగా జరుగుతున్న పెంపుడు ఉగ్రవాదుల హత్యలు పాక్‌ను కలవరపెడుతున్నాయి. భారత్ లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడి మాస్టర్‌మైండ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హత్యకు గురయ్యాడు.
పాకిస్థాన్ లోని సియాల్ కోట్‌లో బుధవారం అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి చంపేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు లతిఫ్ లాంచింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2 వ తేదీన పంజాబ్ లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై భీకర ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 17 గంటల పాటు జరిగిన ఈ దాడిలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పఠాన్‌కోట్‌లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు.
ఈ దాడికి పాల్పడిన ఐదుగురు ముష్కరులను భారత భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ ఘటనకు సూత్రధారి షాహిద్ లతీఫ్ అని అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. పాక్ నుంచే అతడు ఈ దాడికి పథకం రచించినట్టు తెలిసింది. అతడే ఐదుగురు ముష్కరులను కో ఆర్డినేట్ చేసి పఠాన్‌కోట్‌కు పంపినట్లు దర్యాప్తు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
అయితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా , ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో లతీఫ్ 1994 నవంబరులో జమ్ముకశ్మీర్‌లో అరెస్టయ్యాడు. 16 ఏళ్ల పాటు భారత జైల్లో శిక్షఅనుభవించిన అతడిని 2010లో వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు అప్పగించారు. కాగా 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్థాన్ లోని కాందహార్‌కు తీసుకెళ్లిన ఘటనలో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు.
ఈ ఏడాదిలో ఐదో ఘటన
ఇదిలా ఉండగా … పాకిస్థాన్ వేదికగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్ కమాండర్ ఇలా దుండగుల కాల్పుల్లో మరణించడం ఈ ఏడాది చోటు చేసుకున్న ఐదోఘటన కావడం గమనార్హం. గత నెల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఏడాది మార్చిలో రావల్పిండిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్‌ను దుండగులు హత్య చేశారు. అంతకు ముందు , ఈ ఏడాది ఫిబ్రవరిలో అల్ బదర్ ముజాహిదీన్ మాజీ కమాండర్ సయ్యద్ ఖాలిద్ రజాను కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇక , ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్ అయిజాన్ అహ్మద్ అహంగర్ ఈ ఏడాది ఆరంభంలో అఫ్గాన్‌లో అనుమానాస్పద రీతిలో మరణించాడు.