Monday, January 20, 2025

మలేరియాను మట్టుబెట్టేదెప్పుడు!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2007 నుంచి ప్రపంచ మలేరియా దినం నిర్వహించుట ఆనవాయితీగా వస్తున్నది. 2000 సంవత్సరం నుంచి మలేరియా నిర్మూలన, రోగ నిర్ధారణ, వైద్య రంగాల్లో ప్రపంచ దేశాలు గుణాత్మక ఫలితాలను సాధించి పిల్లలతో పాటు పెద్దలను మలేరియా నుంచి కాపాడటం జరుగుతోంది. గత రెండు దశాబ్దాలుగా 7 మిలియన్ల ప్రజలను మలేరియా నుంచి కాపాడటం, ఒక బిలియన్ జనులకు మలేరియా సోకకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరిగింది. ‘ప్రపంచ మలేరియా దినం -2023’ నినాదంగా ‘జీరో మలేరియా దిశగా అడుగులు : పెట్టుబడిలు, ఆవిష్కరణలు, అమలు’ అనే అంశాన్ని తీసుకొని సామాన్యులకు అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో దాదాపు అన్ని ప్రపంచ దేశాలు ‘జీరో మలేరియా’ దేశాలుగా రూపాంతరం చెందే దిశలో అడుగులు వేయడం సంతోషదాయకం.
దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మలేరియా ముప్పు
ప్లాస్మోడియం పరాన్నజీవి వల్ల సంక్రమించే మలేరియా ప్రాణాంతకమైన వ్యాధిగా గుర్తించబడింది. ఆడ అనాఫిలిస్ దోమ కాటు వల్ల మానవులకు సోకే మలేరియా వల్ల అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రమాదకరంగా మారడం విచారకరం. విశ్వవ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఏటా 229 మిలియన్ల ప్రజలు కొత్తగా మలేరియా బారినపడుతున్నారని ‘ప్రపంచ మలేరియా నివేదిక -2020’ తేల్చింది. 2019లో 4.09 లక్షల మలేరియా మరణాలను ప్రపంచవ్యాప్తంగా గమనించారు. విశ్వవ్యాప్తంగా 106 దేశాలకు సంబంధించిన 3.3 బిలియన్ల జనులు మలేరియా బారిన పడే ప్రమాదపు అంచున ఉన్నారు. ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం 2018 ప్రకారం ప్రపంచ మలేరియా కేసుల్లో 93 శాతం ఆఫ్రికా దేశాల్లోనే బయట పడటమా కాకుండా 94 శాతం మరణాలు రికార్డు కావడం జరిగింది.
మలేరియా రహిత దేశాలు
ప్రపంచ దేశాలు మలేరియా నిర్మూలనకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని, కొన్ని దేశాలు ‘మలేరియా రహిత దేశాలు’గా ప్రకటించబడ్డాయని ఐక్యరాజ్యసమితి అభినందన పూర్వకంగా హర్షాన్ని వ్యక్తం చేసింది. వరుసగా 3 ఏండ్ల పాటు మలేరియా కేసులు నమోదు కాని దేశాలను ‘మలేరియా రహిత దేశాలు’గా ఐరాస ప్రకటిస్తున్నది. 2007లో యుఎఇ, 2016లో శ్రీలంక లాంటి 9 దేశాలను ఐరాస జీరో మలేరియా దేశాలుగా ప్రకటించింది. 2025 నాటికి మరో 25 దేశాలు మలేరియా రహిత దేశాల జాబితాలో చేరేందుకు పటిష్టమైన కార్యాచరణ అమలు పరుస్తున్నాయి. 2019లో మలేరియా కేసులు బయటపడుతున్న 87 దేశాల్లో 46 దేశాలు 10 వేల కన్న తక్కువ కేసులను నమోదు చేశాయని, 2000లో 26 దేశాలు మాత్రమే ఉన్నాయని ఐరాస గుర్తు చేసింది. 2020 నాటికి మరో 24 దేశాలు గత 3 ఏండ్లుగా మలేరియా కేసులు నమోదు కాలేదని, వీటిలో 11 దేశాలు మలేరియా రహిత దేశాల జాబితాలో చేరాయని వివరించింది. చైనా, ఇరాన్, మలేషియా లాంటి మరో 8 దేశాలు 2020 నాటికి ‘జీరో మలేరియా’ దేశాలుగా గుర్తించబడినవి. భూటాన్, కోస్టారికా, నేపాల్‌లు ఏడాదికి 100 లోపు కేసుల నమోదుతో మలేరియా రహిత దేశాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి.
భారత్‌లో మలేరియా
1947లో భారత్ జనాభా 330 మిలియన్లు ఉండగా, అందులో ప్రతి ఏటా 75 మిలియన్ల ప్రజలకు మలేరియా సోకడం జరిగింది. 1994లో కేసుల సంఖ్య 2.51 మిలియన్, మరణాలు 0.99 మిలియన్ గుర్తించారు.2019లో 2.86 లక్షల కేసులు నమోదు కాగా, అక్టోబర్- 2020 వరకు 1.57 లక్షల మలేరియా కేసులు నమోదైనాయి. 2000లో 29,500 మరణాలు నమోదు కాగా, 2019లో మలేరియా మరణాల సంఖ్య గణనీయంగా పడిపోయి 7,700లకు చేరడం శుభ పరిణామంగా గుర్తించారు. ఇండియాలో మలేరియా లాంటి ‘వాహక జీవి ద్వారా కలిగే వ్యాధి (వెక్టర్ బార్న్ డిసీజెస్)’ జాబితాలో డెంగ్యూ, ఫైలేరియాసిస్, కాలా-ఆజర్, జపనీస్ ఎన్సిఫలైటిస్, చికెన్ గున్యా లాంటి ప్రమాదకర రోగాలు దేశ వైద్యరంగానికి సవాళుగా నిలిచాయి. ఐరాస రూపొందించిన ‘ప్రపంచ మలేరియా నివేదిక- 2020 ‘గణాంకాల ప్రకారం ఇండియాలో మలేరియా నివారణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తేల్చింది.
2018 గణాంకాలతో పోల్చితే 2019 లో మలేరియా కేసులు 21.3 శాతం, మరణాలు 20 శాతం తగ్గాయని తెలుస్తున్నది. ఇండియాలో 2000- 19 మధ్య రెండు దశాబ్దాల కాలంలో మలేరియా కేసులు 83.34 శాతం, మరణాలు 92 శాతం తగ్గడంతో ‘మిలినియమ్ డెవలప్‌మెంట్ గోల్స్ -6’ సాధించటంలో సఫలమైనట్లు గమనించారు. మన దేశంలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఎంపిల్లో అధిక మలేరియా కేసులను గమనించి, ‘హై బర్డన్ టు హై ఇంపాక్ట్’ ప్రణాళికలను అమలుపరిచారు.
మలేరియా రహిత భారతం సాధ్యమా?
2027 నాటికి ఇండియాను ‘మలేరియా రహిత దేశం’గా ప్రకటించడానికి అనేక పటిష్ట కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టడం జరుగుతోంది. మలేరియాకు కారణమైన దోమ కాటును నివారించడం ప్రథమ కర్తవ్యంగా భావించాలి. దోమ కాటు నివారణకు దోమ తెరలు, దోమలను వికర్షించే క్రీమ్‌లు /ద్రవాలు /కాయిల్స్ / మ్యాట్స్ వాడటం, శరీర అవయవాలు కప్పుకునేలా దుస్తువులు ధరించడం, డోర్‌లకు నెట్స్ అమర్చుకోవడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మురికి నీటినిల్వలు లేకుండా స్వచ్ఛ భారత్ నిర్వహించడం లాంటివి మలేరియా నిర్మూలనకు దోహదపడతాయి. మలేరియా నివారించదగిన వ్యాధి. సరైన అవగాహనతో అడ్డుకట్ట వేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మలేరియా సోకినా భయపడకుండా అందుబాటులో ఉన్న సరైన చికిత్సతో సకాలంలో వైద్య సలహాలు తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. కరోనా విపత్తు విజృంభణతో మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చని మరువరాదు.
మలేరియా కట్టడి మార్గాలు
దశాబ్దాలుగా మానవాళిని పట్టి పీడిస్తున్న భయంకర మలేరియా వ్యాధిని కట్టడిచేయడానికి అంతర్జాతీయ సమాజం నడుం బిగించడం సంతోషదాయకం. మలేరియా నివారణకు వివిధ దేశాలు వివిధ రకాలైన కార్యాచరణలను అమలు పరచడంలో సఫలీకృతం కావడం గమనిస్తున్నాం. మలేరియా కట్టడికి ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలు ప్రధానమైనవిగా గుర్తించారు. మలేరియాను సమర్థవంతంగా కట్టడి చేయడానికి దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, వ్యాధి నిర్థారణ, సరైన చికిత్సల పట్ల ప్రభుత్వాలు సకారాత్మక చర్యలు తీసుకోవడంతో పాటుగా అవసర నిధుల కేటాయింపు సమయానుకూలంగా జరగాలి. మలేరియాకు చికిత్స కన్నా నివారణే సులభమని గమనిస్తూ, మలేరియా రహిత భారత దేశ నిర్మాణంలో మనందరం చేయిచేయి కలిపి ఆరోగ్య భారతాన్ని సుసాధ్యం చేద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News