అమెరికాలోని ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన నర్సుపై ఆ ఆస్పత్రిలో పేషెంట్ గా చేరిన ఓ అమెరికా పౌరుడు జాత్యహంకార దాడికి పాల్పడ్డాడు. నర్స్ ముఖంమీద, వంటి మీద తీవ్రంగా కొట్టి గాయపరచాడు. దాడి చేసిన వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బందికి మరింత రక్షణ కల్పించాలని
సిబ్బంది డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 19న ఈ దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తిని 33 ఏళ్ల స్టీఫెన్ స్కాంటిల్‌బరీగా గుర్తించారు. హెచ్ సి ఏ ఫ్లోరిడా పామ్స్ వెస్ట్ హాస్పిటల్ సైకియాట్రిక్ వార్డులో 67 ఏళ్ల లీలమ్మ లాల్‌పై దాడి చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి. ఈ దాడిలో ఆమెకు ముఖ్యంగా ముఖంపై తీవ్రంగా దెబ్బలు తగిలాయి.ఎముకలు చిట్లిపోయాయి. అరెస్ట్ అయిన స్టీఫెన్ స్కాంటిల్ బరీని పామ్ బీచ్ కౌంటీ కోర్ట్‌హౌస్‌లోని సర్క్యూట్ కోర్టులో హాజరు పరిచారు. అతని విచారణ
సందర్భంగా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన సార్జెంట్ బెత్ ‘
న్యూకాంబ్ నిందితుడు ఎంతటి జాతి విద్వేషాన్ని ప్రదర్శించాడో వెల్లడించారు. లీలమ్మ లాల్ అనే 67 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన నర్సు మానసిక వార్డులో రోగిగా ఉన్న స్టీఫెన్ స్కాంటిల్‌బరీని పరిక్షించేందుకు వెళ్ళినప్పుడు అతను ఆమెపై దారుణంగా దాడి చేశాడు. ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ… బూతులు తిడుతూ, భారతీయులు చెడ్డవారు.. నేను భారతీయ డాక్టర్ ను చూసి సిగ్గుపడుతున్నా అని అన్నాడని సార్జెంట్ బెత్ న్యూ కాంబ్ కోర్టుకు వివరించాడు. దాడి జరిగిన వెంటనే ఆ వ్యక్తి పామ్ వెస్ట్ ఆస్పత్రి నుంచి కనీసం చొక్కా కూడా లేకుండా పరారయ్యాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, హత్యాయత్నం, విద్వేష పూరితంగా నేరానికి పాల్పడ్డాడని పేర్కొంటూ కేసు పెట్టారు.భారతీయ సంతతి నర్సుపై దాడి తర్వాత లీలమ్మ లాల్ కు అన్నివర్గాలనుంచి మద్దతు వెల్లువెత్తుతోంది, అలాగే ఆసుపత్రులలో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్
మొదలైంది.