Friday, November 22, 2024

ఇళ్ల స్థలాలకు పాస్‌బుక్‌లు

- Advertisement -
- Advertisement -

ధరణి స్థానంలో భూమాతను తీసుకొవస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ల్యాండ్ కమిషన్ వేస్తామని, ప్రభుత్వ భూములు, పౌరుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అందులో భాగంగానే రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్ ఓ ఆర్ చట్టాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్-2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తీసుకొచ్చింది. భూ హక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటివరకు పాసుబుక్‌లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహక్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడంతో పాటు రైతులకు మేలు చేసేలా ఈ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది.

దీంతోపాటు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్‌లను ముసాయిదా బిల్లులో ప్రతిపాదిం చింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక కొత్త ఆర్‌ఓఆర్ చట్టం అమల్లోకి తీసుకురానుంది. కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేయడంతో పాటు పాత నాలుగు ఆర్‌ఓఆర్ చట్టాలను క్రోడీకరించి ఈ ముసాయిదాను తయారు చేశారు. అందులో భాగంగా 18 రకాలుగా భూమి మీద రైతులకు హక్కులు కల్పించవచ్చని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం. సునీల్ కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సిఎంఆర్వో పిడి వి. లచ్చిరెడ్డిలు కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కొత్త ‘ఆర్‌ఓఆర్ ముసాయిదా 2024’పై పలు సందేహాలను, సలహాలను ‘మనతెలంగాణ’తో భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ పంచుకున్నారు. 2020కి ముందు ఉన్న రెవెన్యూ చట్టాలు, కొత్తగా రానున్న ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్-2024’ల మధ్య తేడాలను ఆయన తెలియచేశారు.

నాలుగు చట్టాలను పరిశీలించి కొత్త చట్టం రూపకల్పన
‘రికార్డ్ ఆఫ్ రైట్స్ -2024 చట్టం’ ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం అధికారులు, రెవెన్యూ నిపుణులు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాం. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి వాటి అమల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసి ఈ కొత్త చట్టాన్ని రూపొందించాం. తెలంగాణలో ఆర్‌ఓఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి పలు సెక్షన్‌లతో ఈ ముసాయిదాను సిద్ధం చేశాం. ఈ క్రమంలోనే 18 రాష్ట్రాల్లోని ఆర్‌ఓఆర్ చట్టాలను పరిశీలించడంతో పాటు బీహార్ అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశాం. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును ఇందులో కల్పించనున్నాం.

భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు
భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి ఈ ముసాయిదాలో ప్రస్తావించాం. ఏరకంగా హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్)లో నమోదు చేయాలని సూచించాం. రిజిస్ట్రర్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను ఇందులో కొనసాగించాం. ఈ పద్ధతుల్లో తహసీల్దార్ రిజిస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటును ఈ చట్టంలో పొందుపరిచాం. ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ ని అధికారం తహసీల్దార్‌కు కల్పించాం. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌ను విచారించే అధికారం తహసీల్దార్‌లకు, మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీఓకు అధికారం కల్పించాం.

కొత్త చట్టంలో అప్పీల్, రివిజన్‌లకు అవకాశం
తహసీల్దార్లు, ఆర్డీఓలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్, రివిజన్‌లకు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. మొదటగా కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్ల, అక్కడ పరిష్కారం కాకపోతే సిసిఎల్‌ఏకు అప్పీల్ చేసుకునేలా ఈ ముసాయిదాలో సూచించాం.
రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సిసిఎల్‌ఎ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచాం. గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సిసిఎల్‌ఎకు కల్పించాం. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకొని కూడా పరిష్కరించవచ్చు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్ లేదా రివిజన్‌లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశాం. 2020 చట్టంలో ఈ అంశం లేదని కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్‌లతోనే పరిష్కారమవుతాయి. యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. తద్వారా కోర్టులపై భారం తగ్గుతుంది.

సాదాబైనామా దరఖాస్తులకు ఫీజు లేకుండా….
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశాం. రిజిస్ట్రేషన్‌ను తీసుకు వెళ్లేవారు ఈ మ్యాప్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్ వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధన ప్రస్తుత చట్టంలో పొందుపరిచాం. అయితే ప్రభుత్వం నిర్ధేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్నాక మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని ఈ ముసాయిదాలో) పేర్కొన్నాం. ఇప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్‌లో ఉన్న 9.24లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకొని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచాం. కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సాదాబైనమా దరఖాస్తులపై కోర్టు స్టే
సాదాబైనమా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు 2020లో ఎలాంటి చట్టం చేయలేదు. హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేస్తే అసలు ఈ దరఖాస్తులను ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. అందులో భాగంగా 7 లక్షల దరఖాస్తులపై స్టే విధించింది. దీంతోపాటు పాత 2 లక్షల పైచిలుకు దరఖాస్తులను క్రమబద్దీకరించినా వాటికి సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోర్టు సూచించింది. మొత్తం 9 లక్షల 24 వేల దరఖాస్తులకు మోక్షం కలిగించేలా ఈ కొత్త చట్టంలో సాదాబైనమాలకు ప్రత్యేక స్థానం కల్పించాం.

ప్రస్తుత చట్టంలో సాదాబైనామాల పరిష్కారం ఆర్డీఓలకు కూడా
సాదాబైనామాల పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లు ఉండగా ఈ కొత్త చట్టంలో ఆర్డీఓలకు సైతం అధికారాలు కల్పించాం. దీంతోపాటు ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇస్తారు. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూదార్‌ను జారీ చేస్తారు. ఈ భూదార్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచాం. భూదార్‌తో పాటు ఈ ఆబాదీల ఆర్‌ఓఆర్‌కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్‌ఓఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించాం. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి ఉండి రికార్డులోకి ఎక్కలేని వారికి మండల, డివిజన్ స్థాయిలో వారి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ చట్టం వస్తే వ్యవసాయ భూములతో పాటు ఇంటి స్థలాల సమస్య తీరడంతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

2020లో తాత్కాలిక ట్రిబ్యునళ్ల ఏర్పాటు
రెవెన్యూ ట్రిబ్యునల్ అనేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవి. గత ప్రభుత్వం 2020లో వాటిని పూర్తిగా రద్దు చేసి తాత్కాలికమైన ట్రిబ్యునల్‌ను మాత్రమే పెట్టి అప్పట్లో కొన్ని భూ సమస్యలను పరిష్కరించింది. ధరణి వల్ల కోర్టుల్లో భూమి కేసులు ఎక్కువయ్యాయి. అన్ని రకాల భూమి సమస్యలకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఉండాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం ట్రిబ్యునళ్లు అవసరం లేదని ఈ ప్రభుత్వం భావించడం లేదు. అలా అని వాటిని ఏర్పాటు చేయాలని కూడా అనుకోవడం లేదు. కొత్త రెవెన్యూ చట్టాన్ని సమగ్రంగా అమలు చేస్తే అప్పుడు భూ సమస్యలు ఉండవని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఆర్‌ఓఆర్ చట్టం (రికార్డుల సవరణ కోసం) ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయదు. హక్కుల నిర్ధారణ కోసమే ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదాలో సూచించాం.

ఆర్‌ఓఆర్ చట్టానికి, రెవెన్యూ ట్రిబ్యునల్‌కు సంబంధం లేదు
ఆర్‌ఓఆర్ చట్టానికి, రెవెన్యూ ట్రిబ్యునల్‌కు అసలు సంబంధం లేదు. ఆర్‌ఓఆర్ అనేది రికార్డులను తయారు చేసే వ్యవస్థ మాత్రమే. ఈ చట్టం ప్రకారం హక్కుల నిర్ధారణ జరగదు. రికార్డుల సవరణలో అధికారులు తప్పులు చేస్తే అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే రివిజన్ పిటీషన్ వేసుకోవచ్చు. అసైన్డ్, టెనెన్సీ, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్, ల్యాండ్ గ్రాబింగ్, అటవీ భూములపై వివాదాలు తలెత్తితే పరిష్కరించడానికి రెవెన్యూ కోర్టులు ఉంటాయి. అక్కడా పరిష్కారం లభించకపోతే సమస్యల తీవ్రతను బట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవచ్చు. దేశంలో బీహార్‌లో మినహా మరెక్కడా రెవెన్యూ ట్రిబ్యునల్ లేదు. బీహార్‌లో రెవెన్యూ ట్రిబ్యునల్ ఉన్నా అక్కడ కూడా రెవెన్యూ అధికారులతో నడిపిస్తున్నారు.

ఇంటిస్థలాలకు పాస్‌బుక్‌లు
ప్రస్తుతం ధరణి స్థానంలో మరో హక్కుల రికార్డు వస్తుంది. ధరణిలో తప్పొప్పులను సవరించడానికి చట్టం లేదు. రానున్న కొత్త చట్టంలో ఆర్‌ఓఆర్‌లో తప్పులుంటే సవరించవచ్చు. ఆర్‌ఓఆర్‌లో ఎక్కని భూములను చేర్చడానికి ప్రస్తుతం సవరణలు చేశారు. ఇంటిస్థలాలకు కూడా పాస్‌బుక్‌లు కూడా ఇచ్చే అవకాశం కల్పించాం. వ్యవసాయ భూములకు భూదార్ కార్డులను ఇస్తారు. ఈ చట్టంలోనే భూములకు రీ సర్వే చేయాలని నిర్ణయించాం.
తహసీల్దార్‌లు, ఆర్‌డిఓలు ఇద్దరూ మ్యుటేషన్ అధికారులే
భూముల రీసర్వేలో భాగంగా టెంపరరీ భూదార్ కార్డు, పర్మినెంట్ భూదార్ కార్డును జారీ చేయాలని ఈ ముసాయిదాలో సూచించాం. మనిషిని ఆధార్‌కార్డు వల్ల ఎలా గుర్తిస్తారో అలాగే భూమిని గుర్తించేలా భూదార్ నెంబర్‌ను కేటాయించాలని నిర్ణయించాం. ఆ భూమికి సంబంధించిన ప్రతి సమాచారం అందులో నిక్షిప్తం అవుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి భూముల సమాచారం చేరుతుంది. ఈ కొత్త చట్టంలో తహసీల్దార్‌లు, ఆర్‌డిఓలు ఇద్దరూ మ్యుటేషన్ అధికారులే. పాస్‌బుక్ జారీ చేసే అవకాశం తహసీల్దార్‌కు, సాదాబైనమాలను క్రమద్దీకరించే అవకాశం ఆర్‌డిఓలకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News