Saturday, November 23, 2024

జోడెడ్లలా పల్లె, పట్నం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పట్టణ ప్రగతి అద్భుతం
కేంద్రం ఇచ్చే అవార్డులే దీనికి నిదర్శనం
శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రి తారక రామారావు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పురపాలక శాఖ దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌తో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ దశాబ్ధి ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రి తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ అన్నట్లుగా పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్నమాట ఎంత వాస్తవమో, పట్టణాలు భారతదేశానికి ఆర్థిక ఇంజన్లు అనడం అంతే వాస్తవమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 45 నుంచి 50 శాతం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుంచే వస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదువేల సంవత్సరాల్లో జరిగిన పట్టణీకరణ, రానున్న 50 సంవత్సరాల్లోనే జరుగుతుందన్న అంచనాలు అధికంగా ఉన్నాయన్నారు. రానున్న ఐదు సంవత్సరాల్లో మెజార్టీ తెలంగాణ జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుందన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా పరిపాలన సంస్కరణలను, పథకాలను తీసుకువస్తే పాలన విజయవంతం అవుతుందని ముఖ్యమంత్రి విశ్వాసమన్నారు. ఆ అలోచన మేరకే అనేక పరిపాలన సంస్కరణలను, నూతన పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలను, టిఎస్ బిపాస్ వంటి నూతన భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియను తీసుకువచ్చారన్నారు.

రాష్ట్రంలో సమగ్ర, సమ్మిళిత, సంతులిత, సమతుల్య పరిపాలన
రాష్ట్రంలోని పౌరులపై విశ్వాసం ఉంచి, టిఎస్ బిపాస్‌తో పాటు పన్ను మదింపు విషయాల్లో సెల్ఫ్ అసెస్‌మెంట్ ప్రక్రియను తీసుకువచ్చామని కెటిఆర్ తెలిపారు. పరిశ్రమలకైనా, నివాస గృహాలకైనా నిర్ణీత సమయంలో, వేగంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటి మాత్రమేనన్నారు. తెలంగాణలో ఈరోజు సమగ్ర, సమ్మిళిత, సంతులిత, సమతుల్య పరిపాలన కొనసాగుతుందన్నారు. విప్లవాత్మకమైన ఆలోచన విధానంతో సమాజంలోని అన్ని వర్గాలను, పట్టణాలను, పల్లెలకు ఎలాంటి తేడా లేకుండా ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వం తమదన్నారు.
ఐటీ పరిశ్రమ నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కెసిఆర్ విధానాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్న ఘనత రాష్ట్రంలోని ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు దక్కుతుందన్నారు.

నెలరోజుల వ్యవధిలో 150 వార్డుల్లో….
నెలరోజుల వ్యవధిలో నగరంలో 150 వార్డుల్లో వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జిహెచ్‌ఎంసి ప్రజల పట్ల తన కమిట్‌మెంట్‌ను చాటుకుందన్నారు. దీనికి జిహెచ్‌ఎంసి సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రజలంతా భయాందోళనకు గురైన కరోనా సంక్షోభ కాలంలోనూ జిహెచ్‌ఎంసి అధికారులు రోడ్ల నిర్మాణం, లింకు రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం,పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నారన్నారు. భారతదేశంలో అధిక వేతనం అందుకుంటున్న పారిశుద్ధ కార్మికులు తెలంగాణలో ఉన్నారని గర్వంగా చెప్పవచ్చన్నారు. కానీ, వారు చేసే సేవలకు ఎంత చేసిన తక్కువేనని మంత్రి కెటిఆర్ తెలిపారు.

కేంద్రం ఇచ్చే అవార్డులో 30 శాతం తెలంగాణకే….
ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక సాధారణ పౌరుడి కోణంలో ఆలోచించి, ప్రభుత్వ పథకాలను పరిపాలన విధానాలను రూపొందిస్తారన్నారు. దేశ జనాభాలో మూడు శాతం కన్నా తక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఇచ్చే అవార్డులో 30 శాతానికి పైగా గెలుచుకుంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుంది అన్నట్టుగా మారిందన్నారు. ప్రజలు శాంతిని అభివృద్ధిని కోరుకునే వారు, తెలివైన వారని, రాష్ట్రంలో ఎవరూ ఎంత అరిచి గీపెట్టినా ప్రజలు ప్రజలు పనిచేసిన ప్రభుత్వానికే పట్టం కడతారని ఆయన తెలిపారు.

పట్టణ ప్రగతి కింద రూ.4,537 కోట్ల నిధులు విడుదల
నగరం విశ్వనగరంగా మారాలంటే ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడి, ఆ స్థాయి మౌలిక వసతులను, పౌర సదుపాయాల కల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సమగ్రమైన ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం వివిధ ప్రణాళి కలతో ముందుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే లెగసి డంప్ కోసం బయోమైనింగ్, డ్రై రీసోర్స్ సెంటర్లను, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. హరిత పట్టణాల ఏర్పాటు దిశగా పార్కుల ఏర్పాటు, నర్సరీల ఏర్పాటు, నగరవనాలు, అర్భన్ లంగ్‌స్పేస్‌ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రస్తుతం పట్టణాల్లో ఏడు శాతం గ్రీనరీ పెరిగిందని, క్రమం తప్పకుండా ప్రతి నెల మౌలిక వసతుల ఏర్పాటు, నిర్వహణ కొరకు పట్టణ ప్రగతి కింద రూ.4,537 కోట్లు నిధులను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.

సెప్టెంబర్ నాటికి 100 శాతం మురికినీరు శుద్ధి
తెలంగాణ అర్భన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టియూఎఫ్‌డిసి), పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు పట్టణాలకు రూ.4,706 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని కెటిఆర్ తెలిపారు. పట్టణాల్లోని చెరువుల బలోపేతం, సుందరీకరణ, అభివృద్ధిని చేపడుతున్నామన్నారు. రూ.7,100 కోట్లతో తొలి దశ మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమం ద్వారా పట్టణాలకు త్రాగునీరు అందిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆధునిక వసతులతో 335 వైకుంఠధామాలు రూ.375 కోట్లు నిధులు ఇచ్చామని, హైదరాబాద్‌లో ఈ సెప్టెంబర్ నాటికి 100 శాతం మురికినీరు శుద్ధి చేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఘనత సాధించనున్న తొలి నగరంగా హైదరాబాద్ మారనుందన్నారు.

నూతనంగా మూసీనదిపై 14 బ్రిడ్జిలు
నగరంలో మెట్రో విస్తరణతో పాటు, ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ వేను ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మూసీనది పైన 14 బ్రిడ్జిలను నూతనంగా నిర్మించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా నాలాల బలోపేతానికి చర్యలు చేపడుతున్నామన్నారు. దీనివల్ల బస్తీలకు వరద ప్రమాదం తప్పుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో హెరిటేజ్ సంపాదన కాపాడేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. క్రీడా శాఖతో కలిసి పురపాలక శాఖ ప్రతి పట్టణంలో ఒక మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రూ.71 కోట్లతో పట్టణాల్లోని అన్ని బడుల్లో స్వచ్ఛబడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

అన్ని పట్టణాల్లోనూ అభివృద్ధి
హైదరాబాద్ మాత్రమే కాకుండా అన్ని పట్టణాల్లోనూ ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నామ న్నారు. అదిలాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ దాకా, గద్వాల నుంచి మొదలుపెడితే భద్రాచలం దాకా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో సమూలం మార్పుకి తొమ్మిది సంవత్సరాలుగా కృషి చేసిన ప్రభుత్వ అధికారులు మరోసారి ప్రజల సంక్షేమం కోసం పునరంకితం అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలే కేంద్రంగా ఉన్న ప్రభుత్వ పాలన దిశగా ముందుకు పోవాలని ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ప్రభుత్వ కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరికి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

భవిష్యత్‌లోనూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లను, చైర్మన్లను, మేయర్లను, ఉద్యోగులను ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించింది. ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును ప్రజలకు నాయకులు వివరించారు. జాతీయ స్థాయిలో పట్టణ అభివృద్ధిలో సాధించిన విజయాలు, అవార్డుల వివరాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News