Monday, December 23, 2024

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నింటిన పట్టణ ప్రగతి సంబరాలు

- Advertisement -
- Advertisement -
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా పట్టణ ప్రగతి ఉత్సవాలు ఘనంగా సాగాయి. పారిశుద్ధ్య కార్మికులను, సఫాయి అమ్మ, సఫాయి అన్న సలాం అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య వాహనాల భారీ ర్యాలీలతో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఊరూవాడ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. వేడుకల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి మల్లారెడ్డి
ఎక్కడా లేని విధంగా రాష్ట్రం పట్టణ ప్రగతిని సాధిస్తోందని, స్వచ్ఛసర్వేక్షణ్‌లో మన పురపాలక సంఘాలు అవార్డులు సైతం పొందాయని మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో పట్టణప్రగతి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పట్టణప్రగతి ఉత్సవాలు జోరుగా సాగాయి. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్లో అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వరంగల్‌లో పెద్దఎత్తున ర్యాలీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో ఎమ్మెల్యే సతీష్‌కుమార్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. వరంగల్‌లో పట్టణ ప్రగతి ర్యాలీని పెద్దఎత్తున నిర్వహించారు. కెఎమ్సీ నుంచి ఎంజీఎం కూడలి వరకు నిర్వహించిన ప్రదర్శనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సిపి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి రోడ్లను ఊడ్చారు. సఫాయి అన్నా సలాం నీకు అంటూ నినదించారు. ఎంజీఎం కూడలిలో సఫాయి కార్మికుల విగ్రహావిష్కరణ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ బతుకమ్మ ఎత్తుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అదిలాబాద్‌లో పట్టణప్రగతి దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే జోగురామన్న, పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్, కమిషనర్ శైలజ తదితరులు ఉద్యోగులతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులను సన్మానించారు.

కార్మికుల పాదాలపై పూలుచల్లిన ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో నిర్వహించిన పట్టణప్రగతి వేడుకల్లో మంత్రి గండ్ర వెంకటరమణారెడ్డి మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో పట్టణ ప్రగతి వేడుకల్లో భాగంగా అంగన్‌వాడీ ఐకెపి మహిళ ఉద్యోగులకు పురపాలక కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఖమ్మంలో పట్టణప్రగతి దినోత్సవంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో మంత్రి అజయ్ పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో నిర్వహించిన వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను ఎమ్మెల్సీ తాతా మధు కడుగగా కార్మికుల పాదాలపై ఎమ్మెల్యే హరిప్రియ పూలు చల్లి సత్కరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News