దట్టమైన చీకటి సొరంగంలోకి ఒక చిన్న వెలుగు కిరణం ప్రసరించినట్టు గాజా దాడుల విరామ ఒప్పందం అతి కష్టం మీద కుదిరింది. పరస్పరం కొంత మంది బందీలను విడుదల చేయడం ప్రాతిపదికగా నాలుగు రోజుల పాటు దాడులు మానుకోడానికి ఇజ్రాయెల్ ఒప్పుకొన్నది. ఈ మేరకు దానికి, హమాస్‌కు అంగీకారం కుదిరింది. ఖతార్, ఈజిప్టుల కృషికి అమెరికా సైతం సహకరించడంతో ఇది సాధ్యమైంది. ఈ ఒప్పందం గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో కనీసం 50 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేస్తుంది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ తన వద్ద నున్న పాలస్తీనా ఖైదీలలో కనీసం 150 మందికి విముక్తి ప్రసాదిస్తుంది.
గత నెల 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీషణ దాడుల సమయంలో అది 240 మందిని అక్కడి నుంచి బందీలుగా తీసుకు వెళ్ళింది. అలాగే ఇజ్రాయెల్ జైళలో 7200 మంది పాలస్తీనియన్లు మగ్గుతున్నారు. హమాస్ దాడిలో 1700 మంది ఇజ్రాయెలీలు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికి 7 వారాలుగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో 15200 మంది హతులయ్యారు. వీరిలో వేలాది మంది పసి పిల్లలున్నారు. కేవలం 4 రోజుల దాడుల విరామం వల్ల ఒరిగేదేముందని గాజా వాసులు పెదవి విరుస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఆ తర్వాత కూడా శాంతి కొనసాగేందుకు పరిస్థితులు అనుకూలించవచ్చుననే ఆశ లేకపోలేదు.
విరామం లేని అగ్నివర్షం కంటే ఏ కొంచెమైనా వెసులుబాటు కలగడం మంచిదే కదా! ఆ సమయంలో అవసరమైన సరకులు సమకూర్చుకోడానికి తదుపరి దాడులకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోడానికి అవకాశం కలుగుతుంది కదా అనే అభిప్రాయాన్ని కొట్టి పారేయలేము. అందుచేత ఈ ఒప్పందాన్ని అందరూ స్వాగతించాల్సిందే. ఇందుకు కృషి చేసిన ఖతార్, ఈజిప్టులను అభినందించాల్సిందే. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగిన కొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్ష కార్యాలయంతో ఖతార్ మాట్లాడి బందీల విడుదల ప్రాతిపదికన సంధి కుదిర్చే యత్నాలకు ఒక చిన్న అధికారుల బృందాన్ని నియమించాలని కోరినట్టు ఒక సమాచారం తెలియజేస్తున్నది.
అక్కడితో మొదలైన కృషి ఫలించి ఈ ఒప్పందానికి దారి చేసింది. ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించినందుకు ఖతార్, ఈజిప్టులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒప్పందం అమలయ్యే నాలుగు రోజుల్లో రెండు వైపుల నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు వుండకపోతే ఆ తర్వాత కూడా శాంతి కొనసాగే అవకాశాలు ఏర్పడవచ్చు. ఈ నాలుగు రోజుల శాంతి సమయంలో గాజాకు ఆహారాది సరఫరాలు పూర్తి స్థాయిలో జరుగుతాయి. ఇది హర్షించవలసిన పరిణామం. 75 ఏళ్ళ రక్త క్షేత్రం, ఎప్పుడు ఏ విధంగా పూర్తిగా తెరపడుతుందో తెలియని అయోమయం. మధ్య మధ్యలో రెండు వైపుల నుంచి దాడులు, ప్రతి దాడులు మామూలైపోయాయి. ఇజ్రాయెల్ తరచూ సాగిస్తున్న దురాక్రమణను, తమ దైనందిన జీవితాలపై అది అమలు చేస్తున్న చెప్పనలవికాని అణచివేతను భరించలేక పాలస్తీనియన్లలో తిరుగుబాటు మనస్తత్వం ఏర్పడి హమాస్ వంటి సంస్థల ప్రాబల్యం పెరుగుతున్నది.
అవి సహనం కోల్పోయి ఏ చిన్న హింసాత్మక చర్యకు పాల్పడినా బెంజమిన్ నెతన్యాహు వంటి కరడుగట్టిన యుద్ధోన్మాది నాయకత్వంలోని ఇజ్రాయెల్ చేపడుతున్న ప్రతీకార, పగ సాధింపు దాడుల్లో అసంఖ్యాకంగా పాలస్తీనియన్లు దుర్మరణం పాలవుతున్నారు. బందీలుగా చిక్కి ఇజ్రాయెల్ జైళ్ళలో మగ్గుతున్నారు. ఎంత కాలమీ కుంపటి ఇలా రాజుతుంది? హమాస్ బందీలుగా తీసుకు వెళ్ళిన వారిని విడిపించి తేవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో వేలాది మంది ప్రదరనలు చేశారు. ఈ ఒత్తిడికి తట్టుకోలేక నెతన్యాహు ఈ ఒప్పందానికి సిద్ధపడ్డారనిపిస్తున్నది. పాలస్తీనా భూభాగం మీద యూదులను బలవంతంగా రుద్ది ఇజ్రాయెల్‌కు కుటిల జననం కలిగించిన అమెరికా, దాని మద్దతు దేశాలు ఎంతకీ ఆరని ఈ విద్వేష దావానలానికి అసలు కారకులు. సైనికంగా అమిత బలవంతురాలైన అమెరికా పక్షపాత ధోరణి వల్లనే ఇది ఎప్పటికీ ఆరడం లేదు.
ఇజ్రాయెల్‌ను అదే పనిగా వెనకేసుకొస్తూ దాని దురాక్రమణకు అమెరికా దన్నుగా వుంటున్నది. అవి ఇజ్రాయెల్, పాలస్తీనా ఇరుగుపొరుగు స్వతంత్ర దేశాలుగా బతికే ప్రాతిపదికన శాశ్వత పరిష్కారం కనుగొనడం ఉత్తమమని శాంతి కాముకులందరూ కోరుకొంటున్నారు. ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని ఇందుకు బొత్తిగా సిద్ధంగా లేవు. హమాస్ దాడి జరిగిన వెంటనే స్వయంగా ఇజ్రాయెల్ వెళ్ళి పరామర్శించిన అమెరికా అధ్యక్షుడు వేలాది మంది పసిపాపలు గాజాలో దుర్మరణం పాలవుతుంటే అదే స్థాయిలో స్పందించకపోడాన్ని ఏమనాలి? ఇటువంటి శక్తి అదుపులో ప్రపంచం వుండడమే మహా విషాదం.