Sunday, December 22, 2024

భారత్‌లోకి ‘మస్క్’కి మార్గం సుగమం

- Advertisement -
- Advertisement -

భారత పారిశ్రామిక, వాణిజ్య రంగంలోకి అపర కుబేరుడు ఎలాన్‌మస్క్ ప్రవేశించడానికి ఇప్పుడు తగిన వాతావరణం ఏర్పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్రాడ్‌బాండ్ మార్కెట్ లోకి తన టెస్లా, స్టార్‌లింక్ బిజినెస్ వెంచర్లను తీసుకురావాలని ఎలాన్ మస్క్ గత కొంతకాలంగా ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ అఖండ విజయం సాధించడం ఎలాన్ మస్క్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. ఒక విధంగా ట్రంప్ విజయానికి పరోక్షంగా ఎలాన్ మస్క్ ఆర్థికంగా, ప్రజాదరణ సమీకరణగా దోహదపడ్డారని చెప్పవచ్చు. ట్రంప్ గెలిస్తే ఎలాన్ మస్క్‌కు అత్యంత ఉన్నతమైన పదవిని కట్టబెడతారన్న అంచనాలు కూడా వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ పలుకుబడిని ఉపయోగించుకుని భారత్ మార్క్‌ట్‌లోకి ఎలాన్ మస్క్ ప్రవేశించడానికి మార్గాలు సుగమం చేసుకుంటారని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్‌లో తమ వెంచర్లను ప్రారంభించాలని ఎలాన్‌మస్క్ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వ విధానపరమైన మద్దతు తగినంతగా లభించడం లేదు. ఉదాహరణకు టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను భారత్‌లో ప్రారంభించాలని కొన్నేళ్ల క్రితం ఆయన ప్రయత్నించారు. కానీ దిగుమతి సుంకం భారీగా విధించే పరిస్థితి ఎదురుకావడంతో తన ప్రయత్నానికి ఆటంకం ఏర్పడింది. స్వదేశీ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తీవ్రంగా మస్క్ ప్రయత్నాన్ని ప్రతిఘటించాయి. టెస్లా విషయంలో ఎలాంటి ఉదారత చూపవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

అయితే మరోవైపు భారత ప్రభుత్వం స్థానికంగా టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు మస్క్‌తో మంతనాలు జరుపుతుండటం ప్రత్యేకించి గమనించవలసిన విషయం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ టెస్లా కార్ల తయారీకి సముచితమైన సహాయం అందించేందుకు వీలుగా దిగుమతి సుంకం సరళం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రూ.30 లక్షల కన్నా విలువైన కార్లకు రెండు మూడేళ్ల పాటు దిగుమతి సుంకంలో రాయితీ కల్పించాలని భావించింది. దీనివల్ల భారత్‌లో ఉపాధి అవకాశాలు లభించడమే కాక, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దేశంలో తగ్గుతాయని భావించింది. 2024లో గుజరాత్‌లో నిర్వహించిన ఇవి మార్కెట్ సందర్భంగా ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను ప్రకటించాలని అనుకున్నారు. కానీ తుది నిర్ణయం ఖరారు కాలేదు. ఇదివరకటి సమాచారం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ భారత్‌ను సందర్శించి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావలసి ఉంది.

దేశంలో ప్రారంభించనున్న కొత్త ఫ్యాక్టరీ కోసం పెట్టుబడులు, ఇతర అంశాలపై తన ప్రణాళికలు ప్రకటించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా స్థానిక తయారీ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలు తయారు చేసే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు చాలా వరకు తగ్గించే యోచనలో ఉంది. అయితే ఇంతవరకు నిర్దిష్టమైన ఒప్పందం ఏదీ కుదరక అస్పష్టంగా తయారైంది. ఇదే విధంగా ఎలాన్ మస్క్ తన శాటిలైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్ సంస్థ ‘స్టార్‌లింక్’ను భారత్‌లో ప్రారంభించాలన్న అత్యంత ఆసక్తితో ఉన్నారు. ఈమేరకు స్పెక్ట్రమ్ నుంచి వసూలు చేసే తక్కువ ఛార్జీల మాదిరిగా స్టార్‌లింక్ వార్షిక ఆదాయంపై కేవలం 1 శాతం మాత్రమే నామమాత్రపు ఫీ వసూలు చేయాలని టెలికమ్ రెగ్యులేటర్ వద్ద ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదనను రిలయన్స్ జియో వ్యతిరేకించింది. సంప్రదాయ టెలికమ్ బిజినెస్‌కు స్టార్‌లింక్ నుంచి శక్తివంతమైన ముప్పు ఎదురవుతుందని జియో ఆందోళన వెలిబుచ్చింది.

అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎ టీమ్‌లో ఒక భాగంగా ఎలాన్ మస్క్ స్థానం పొందే అవకాశం ఉన్నందున తన పారిశ్రామిక, వాణిజ్య వ్యవహారాల్లో చర్చలు జరిపే ఉన్నత హోదా మస్క్‌కు ఉంటుందని పారిశ్రామిక నిపుణులు అంచనాగా చెబుతున్నారు. ఇంతవరకు అమెరికా నుంచి మరో వాణిజ్యవేత్తగా ఉన్న మస్క్, ట్రంప్ కీలక వ్యవహారాల్లో అత్యంత ప్రాధాన్యత గలిగిన సూత్రధారిగా నిలదొక్కుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తిరిగి ఎన్నిక కావడంతో పరిణామాల్లో చాలా మార్పు వచ్చింది. స్వదేశీ అమెరికా వాణిజ్యరంగానికి ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడంలో ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందువల్ల భారత్ నుంచి వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విదేశీ సంస్థలకు సరళమైన నిబంధనలు డిమాండ్ చేయడంలో ఎలాన్ మస్క్‌కు ట్రంప్ గట్టి మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. ట్రంప్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పూర్తిగా సర్వశక్తులు మస్క్ ఒడ్డిన ఫలితంగా తన కంపెనీలు టెస్లాతో సహా స్టార్‌లింక్‌లకు భారత్‌తో అనుసంధానం సరళం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వాణిజ్య రంగ వ్యూహకర్త లియోడ్ మెథియాస్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News