కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటి పవిత్రాగౌడ పోలీస్ కస్టడీలో మేకప్ వేసుకోవడం , లిప్‌స్టిక్ రాసుకోవడం దుమారం రేపాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీస్‌ల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీస్‌లు చర్యలు చేపట్టారు. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ కోసం జూన్ 15న పవిత్రా గౌడను పోలీసులు బెంగళూరు లోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని లిప్‌స్టిక్ రాసుకుంది. లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె , ఆ తర్వాత పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తుండగా మేకప్‌తో నవ్వుతూ కనిపించింది. ఈ హత్యపై ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కన్పించకపోవడంతో పవిత్రపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే కస్టడీలో ఉంటుండగా ఆమె ఇలా చేయడం, పోలీస్‌లు ప్రేక్షక పాత్ర వహించడాన్ని తప్పు పట్టారు. “ పవిత్ర ప్రతిరాత్రి తన ఇంటిలో ఉండడం అలవాటు. అలాగే ఇంటిలో మేకప్ బ్యాగ్‌ను ఉంచుకోవడం జరుగుతుండవచ్చు. మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రతిరోజూ ఉదయం పవిత్ర ఇంటికి వెళ్లి ఎపి నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఆమెను తీసుకువస్తోంది. ఆ సమయంలో పవిత్ర మేకప్‌ను గమనించిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ నటి ప్రవర్తనను అడ్డుకోవాల్సింది. కానీ అలా చేయకుండా నిర్లక్షం చేసినందుకు ఆ మహిలా ఎస్సైకి నోటీసులు జారీ చేసి వివరణ అడిగాం అని డీసీపీ (వెస్ట్ )గిరీష్ వెల్లడించారు. మరోవైపు జైల్లో పవిత్రను ఆమె తల్లి, కుమార్తె కలిశారు. ఆ సమయంలో నటి పవిత్రా గౌడ కనీళ్లు పెట్టుకున్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి
. నటుడు దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చుపెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్ మీడియాలో అసభ్యకర పోర్టు పెట్టడం, తరువాత అతడు హత్యకు గురికావడం, సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. వీరిలో పవిత్రా గౌడను ఏ1, దర్శన్‌ను ఏ 2గా పేర్కొన్నారు. వీరిపై త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.