30న థరూర్ నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ నెల 30న తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కాగా.. థరూర్‌కు ప్రత్యర్థిగా బరిలో నిలిచేది ఎవరన్న సస్పెన్స్ వీడిపోయింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ బన్సల్ మంగళవారం నామినేషన్ పత్రాలు తీసుకున్నారని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. అయితే అవి వేరే వారి కోసం కావచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు థరూర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని ఆయన ప్రతినిధి తనకు తెలియచేసినట్లు మిస్త్రీ వెల్లడించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకుని ఆమె వోటరు ఐడి కార్డును అందచేశానని మిస్త్రీ విలేకరులకు వివరించారు. ఇప్పటి వరకు ఎంతమంది నామినేషన్ పత్రాలు తీసుకున్నది, ప్రతినిధులకు సంబంధించిన సమాచారాన్ని ఆమెకు వివరించినట్లు ఆయన చెప్పారు.