సిపిని కలిసిన జనసేన మహిళా విభాగం
పంజాగుట్టలో ఫిర్యాదు…న్యాయ సలహా కోరుతున్న పోలీసులు
ఎపిలో పోసాని దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన కొనసాగిస్తున్నారు. అమరావతి తాడేపల్లి ప్రాంతంలోని గుండిమెడలో ఆందోళన కారులు సినీనటుడు పోసాని క్రిష్ణ మురళి దిష్టి బొమ్మ దహనం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మరక్కొ మాట మాట్లాడితే, పోసాని భవిష్యత్ లో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ అభిమానులు హెచ్చరిస్తూ నినాదాలు చేశారు.మరోవైపు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య ఫైర్ అయ్యారు. ఇప్పటికే లేఖ రిలీజ్ చేసిన జోగయ్య పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.ముఖ్యమంత్రి కాపులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ని ఆరాధించే కాపుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఆయన శపథం చేశారు. పోసాని కృష్ణ మురళి ఒక జోకర్ అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చేగొండి వెంకట హరిరామజోగయ్య కొట్టిపారేశారు.
పంజాగుట్టలో ఫిర్యాదు
పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదును పోలీసులు న్యాయ సలహాకు పంపారు. లీగల్ ఓపీనియన్ తర్వాత నిర్ణయం ఉందని పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పోసాని కృష్ణమురళీపై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని ఫిర్యాదు ఇచ్చారు.
ఇది జరిగింది
చలన చిత్ర పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు. పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయన వ్యక్తిగత ఫోన్‌కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. పవన్ అభిమానుల మాటలను తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని అభిమానులను పవన్ నియంత్రణలో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. తన కుటుంబంపై అభిమానులతో అనుచిత వ్యాఖ్యలు చేయించిన పవన్ కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. అభిమానుల దాడిలో తాను చనిపోతే పవన్ కల్యాణే కారణమని పేర్కొన్న పోసాని ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడి వెళ్తున్న క్రమంలో పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి యత్నించారు.
సిపిని కలిసిన మహిళా విభాగ నేతలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసేందుకు జనసేన మహిళా కలిశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకురాళ్లు మాట్లాడుతూ మహిళలపై పోసాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పోసాని కృష్ణను బహిష్కరించాలని కోరుతున్నామన్నారు. ప్రెస్ క్లబ్‌లో మహిళలను టార్గెట్ చేసి పోసాని మాట్లాడారన్నారు. పవన్ కల్యాణ్ మీద ఉన్న కోపంతో ఆడవారిని దూషించడం సరైంది కాదన్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా పోసాని గురించి మాట్లాడలేదన్నారు. తాము ఎక్కడా పోసాని మీద దాడి చెయ్యలేదన్నారు. న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కోనసాగిస్తామని జనసేన మహిళా విభాగం తెలిపింది.