Monday, December 23, 2024

ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్న పవన్

- Advertisement -
- Advertisement -

ఆ ఎనిమిది నియోజకవర్గాలపైనే దృష్టి
కూకట్‌పల్లిపై జనసేనకు పెరిగిన ధీమా

మనతెలంగాణ/హైదరాబాద్:  జనసేన పార్టీ అభ్యర్దులు విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులను పోటికి నిలిపారు. ఈ నియోజకవర్గాలపైనే పవన్ అధికంగా దృష్టి కేంద్రీకరించారు. పార్టీనేతలతో చర్చిస్తున్నారు. బిజేపి నేతలతో కలిసి ఉమ్మడిగా రాష్ట్ర మంతటా ఎన్నికల ప్రచారం నిర్వహించాలా లేక జనసేన పార్టీ అభ్యర్ధులు పోటీ చేసిన ఎనిమిది నియోజకవర్గాలకే పరిమితం కావాలా అన్నదానిపై ఇప్పటికే పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బిజేపి ఎన్నికల ప్రచార షెడ్యూల్ అటుంచి… తొలుత జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూకట్‌పల్లి, తాండూర్, కోదాడ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్దులు పోటికి దిగారు.

అయితే ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉండటంతో ఆ జిల్లాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుకు సమీపాన ఉండటం , ఇక్కడ ఆంధ్రాసెట్లర్లు కూడా ఎక్కవగా ఉండటంతో కొంత కష్టపడితే జనసేన అభ్యర్ధులు గెలిచే అవకాశాలు అధికంగా ఉంటాయన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గాల్లో పార్టీ బహిరంగ సభలు, రోడ్‌షోలుకు అధిక సమయం కేటాయించాలని జనసేన అధినేత భావిస్తున్నారు.

కూకట్‌పల్లిపై పెరిగిన ధీమా
గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్దులను పోటి చేయించాలని తొలుత భావించినప్పటీకీ బీజేపితో ఉన్న పొత్తులో భాగంగా గ్రేటర్‌లో ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావాల్సివచ్చింది. అదికూడా సీమాంద్ర ప్రాంతానికి చెందిన సెట్లర్లు అధికంగా ఉండటంతో కూకట్‌పల్లి నియోజకవర్గంపైన జనసేనకు గెలుపు ధీమా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పోటీచేస్తున్న ఎనిమిది నియోజకవర్గాలల్లో మిగిలిన ఏడు నియోజకవర్గాలు ఒక ఎత్తయితే కూకట్‌పల్లి నియోజకవర్గం ఒక్కటి ఒక ఎత్తుగా భావిస్తున్నారు. ఇక్కడినుంచి గతంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ ఐఎఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ విజయం సాధించారు.

2009లో జరిగిన ఆ నాటి ఎన్నికల్లో జేపి గెలుపులో సీమాంధ్ర ఓటర్లే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా సీమాంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే , అదనంగా జనసేన పార్టీ కార్యకర్తల బలం, పవన్ అభిమానులు కూడా ప్లస్ అవుతారని పార్టీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. కూకట్‌పల్లిలో బిజేపి జనజేన నేతలతో ఉమ్మడిగా ఎన్నికల బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తాండూర్ , కోదాడ, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తగినంత సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎనిమిది మంది జనసేన అభ్యర్దులతో మాట్లాడి దీపావళి తర్వాత రెండు మూడు రోజుల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News