అమరావతి: ‘నేను, నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది’ ఎంత గొప్ప మాటలు… ఇంత మంచి మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించి, ఈ దేశం సమైక్యంగా.. సమున్నతంగా.. సమభావంగా.. శక్తిమంతంగా.. ముందుకు సాగడానికి నిర్దేశం చేసిన దేశ భక్తుడు అంబేడ్కర్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అందుకేనేమో ఆయన ‘భారత రత్న’గా ప్రకాశిస్తున్నారని, ఆ మహానుభావుని మూలసూత్రాలు ఆధారంగా జనసేన ప్రస్థానం సాగుతుందని ప్రమాణం చేస్తూ.. ఆయన బోధించిన ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ శాంతిమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళి అర్పిస్తున్నానని చెప్పారు.
Also Read: అంబేడ్కర్ ఉద్యమం, సంస్కృతి
అంబేద్కర్ వంటి మహా జ్ఞాని కోటికొక్కరు ఉంటారని, ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నానని పవన్ తెలిపారు. ముఖ్యంగా తనకు అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత అని, ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, అధ్యయనం చేశానని, లండన్ లో ఒకప్పుడు ఆయన నివసించి, ఇప్పుడు స్మారక మందిరంగా రూపుదిద్దుకున్న గృహాన్ని సందర్శించానని చెప్పారు. అదే విధంగా లక్నోలో గొప్పగా నిర్మితమైన ఆయన స్మారక మందిరాన్ని తిలకించానని, మరెన్నో విషయాలు తెలుసుకున్నానని, బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, విద్యావేత్తగా.. మేధావిగా.. న్యాయకోవిదునిగా.. పాత్రికేయునిగా.. రాజకీయ నాయకునిగా.. రాజ్యాంగ నిర్మాణ సారధిగా.. న్యాయశాఖ మంత్రిగా ఆయన ఈ దేశానికీ చేసిన సేవలు వెలకట్టలేనివని పవన్ ప్రశంసించారు. విమర్శలకు వెరవని అంబేద్కర్ ‘ఏ కారణం లేకుండా తనపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం అని మెచ్చుకున్నారు.
“మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి”అని అణగారిన వర్గాలలో ధైర్యం నింపాలని సూచించారు. అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేసి అసామాన్యునిగా నిలిచారని పవన్ ప్రశంసించారు.