హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్మించిన నూతన పార్లమెంటు భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించిన సంగతి విదితమే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. భరతమాతకు మరో మణిహారం ఈ నూతన పార్లమెంటు భవనం అని అభివర్ణించారు. వీరుల త్యాగఫలంతో స్వతంత్రతను సాధించిన భారతావని సగర్వంగా వజ్రోత్సవాన్ని జరుపుకుందని తెలిపారు. ఈ 75 వసంతాలలో ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో సరికొత్త నిర్ణయాలు, విజయాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.
అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన మన భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోంది. అదే, సెంట్రల్ విస్టా ఆవరణలో శోభాయమానంగా రూపుదిద్దుకున్న నూతన పార్లమెంటు భవనం అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగ నిలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ శుభ తరుణాన జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. త్రికోణాకారంలో రూపుదిద్దుకున్న ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన మోడీకి, బీజేపీ నాయకత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చరితార్ధులుగా భావిస్తున్నానని తెలిపారు.