Saturday, October 5, 2024

జగన్ నాకు శత్రువు కాదు..కక్షసాధింపు చర్యలుండవ్:పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

ఇది కక్ష సాధించే సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేయాలన్నారు. ఎపి ప్రజలకు ఇచ్చిన మాటను తాము నిలబెట్టుకుంటామని తెలిపారు. జగన్, వైసిపి తనకు శత్రువులు కారన్నారు. ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విజయంతో భవిష్యత్‌లో వైసిపిని ఇబ్బంది పెట్టబోమని పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఏం మాట్లాడారో తనకు తెలియడం లేదన్నారు. 21 స్థానాలు తీసుకుని 21 స్థానాలు గెలిచేంత వరకూ తనకు తెలియదన్నారు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు ఉందన్నారు. ఇది జనసైనికులు, వీరమహిళల విజయమని అన్నారు. మార్పు కావాలని, పాలన మారాలని బలంగా కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారని తెలిపారు. ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కక్ష సాధింపులకు సమస్య కాదన్నారు. ఎపికి బలమైన పునాది వేసే సమయం అని అన్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయమన్నారు.

రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం ఇది అని, ఎపికి చీకటి రోజులు ముగిశాయన్నారు. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదని, సిపిఎస్‌కు సరిసమానంగా ఏడాదిలో ప్రభుత్వోద్యోగులకు తీసుకువస్తామని చెప్పారు. మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. గెలిచింది 21 స్థానాలయినా 175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో పనిచేస్తామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు నలిగిపోయారన్నారు. అరాచకం చేశారని, శాంతిభద్రతలను కాపాడతామని హామీ ఇచ్చారు. అధికార వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తక్కువ ఉండేలా చూస్తామన్నారు. గెలుపు తనకు బాధ్యత ఇచ్చింది కాని, అహంకారం ఇవ్వలేదన్నారు. ఇల్లు అలకగానే పండగ కాదన్నారు. చాలా బాధ్యతలున్నాయని తెలిపారు. తాను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదని, అలాగే ఇప్పుడు గెలిచినప్పుడు ఎగిరి గంతేయనని కూడా ఆయన చెప్పారు. తనకు రాజకీయాల నుంచి డబ్బు అవసరం లేదని ఆయన తెలిపారు. పిఠాపురం ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News