హైదరాబాద్: దిగ్గజ పారిశ్రామివేత్త, టాటా మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రతన్ టాటా మృతిపట్ల నటుడు, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రతన్ మరణం దేశానికి తీరని లోటు అని, భారత పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆయన ఆదర్శం అని ప్రశంసించారు. ఉప్పు నుంచి మొదులుకొని విమానయాన రంగం వరకు భారతదేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనిస్తుందన్నారు. సమాజానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని పవన్ ప్రశంసించారు.
భారత దేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శినికుల్లో ఆయన ఒకరని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సేవలో రతన్‌ను మించిన వారు లేరని, పరోపకారి అని, అసాధరణ మానవుడు అని కొనియాడారు. భారత దేశం నిర్మాణంలో అద్భుతంగా కృషి చేశారరన్నారు. రతన్ మృతి భారతీయులకు బాధాకరమైన రోజు అని చిరు తెలిపారు.
రతన్ టాటా ఔదార్యం, వివేకం, నిబద్ధత ప్రపంచంపై చెరగిని ముద్ర వేసిందని సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఓ దిగ్గజాన్ని కోల్పోయామన్నారు. ఆయన ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి ఎప్పటికీ జీవించే ఉంటారని, గొప్ప వ్యక్తికి వీడ్కోలు పలుకుతున్నామని మహేష్ బాబు పేర్కొన్నారు.
రతన్ తెలివితో ఎంతో మంది జీవితాలను మార్చేశారని టాలీవుడ్ నటుడు ఎన్‌టిఆర్ తెలిపారు. భారత దేశం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని, ఆయనది బంగారంలాంటి హృదయం అని, టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ఎన్‌టిఆర్ తెలిపారు.