మన తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తారా? రాజ్యాంగం గురించి అధికార వైసీపీ నేతలకు ఏమి తెలుసని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీసీ నాయకులు ఆధిపత్యధోరణి ప్రదర్శిస్తే తనంత తీవ్రవాది ఉండడని అన్నారు. తనకు భయంలేదని, తన గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ధర్మాన ప్రసాదరావుకు కీలక పదవులు రావడం లేదని రాష్ట్రానికి విడగొట్టడానికి ప్రయత్నిస్తునారని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలా? ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. వైసీపీ పాలనతో ఇప్పటికే ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రాన్ని విడగొడితే చూస్తూ ఊరుకోమని అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్బంగా గురువారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.. తన బిడ్డల భవిష్యత్‌ను పణంగా పెట్టి తాను పార్టీని ప్రారంభించానని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన కార్యాలయానికి రావాలని ఆయన అన్నారు. తాను అవగాహన లేకుండా ఏ విషయం గురించైనా మాట్లాడనని స్పష్టం చేశారు. కులాల మధ్య ఐక్యత కోసం పనిచేస్తానని చెప్పారు. ఒక చేయి సొంత కులం, మరో చేయి కులాల వైపు ఉండాలన్నారు. లేకపోతే మిగిలిన కులాలకు దూరమవుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కులపిచ్చి ముదిరిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజస్వామ్యమని, కులస్వామ్యం కాదన్నారు. యువత ఇప్పుడు బయటకు వచ్చి అన్యాయాన్ని ఎదుర్కొనలేకపోతే బానిసల్లా ఉండిపోతామని అన్నారు. పార్టీ నిర్మాణం అంటే ఒక్క రోజులో జరిగే పనికాదని, సమయం పడుతుందని అన్నారు.