విజయవాడలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యానని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా ఎనిమిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందించే ఏర్పాటు చేసిందని, అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు జనసేన, టిడిపి, బీజేపీ నాయకులు, శ్రేణులు సాయంగా ఉండాలని, ఆహారం, రక్షిత తాగు నీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటు ఇవ్వాలని కోరారు.