ఏపిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం మాదపూర్‌లోని జనసేన పార్టీ అధ్యక్షడు సినీనటుడు పవన్‌కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. 2014 నాటి ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు తిరిగి పదేళ్ల తర్వాత మళ్లీ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా పవన్‌కళ్యాణ్‌తోపాటు ఆ పార్టీ ముఖ్యనేతులు మరికొందరు చంద్రబాబు నాయుడికి ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. పవన్ శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు.తెలుగుదేశం జనసేన పార్టీల రాజకీయపొత్తుల్లో భాగంగా ఇరువురు నేతలు ఏపిలో తాజారాజకీయ పరిస్థితులపై చర్చించారు.
అదే విధంగా రానున్న ఏపి అసెబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీల మధ్యన సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించారు. ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీ చేయాలి ,ఎక్కడెక్కడ ఏ పార్టీ అభ్యర్ధులను బరిలో దింపాలి అన్నది క్లుప్తంగా చర్చించారు. జనసేన పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉన్న ప్రాంతాలు ,సామాజిక సమీకరణలు , బలమైన అభ్యర్దులు తదితర అంశాలు కూడా చంద్రబాబు పవన్‌ల మధ్యచర్చకు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎననికల మేనిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చించారు. ఎన్నికల గడువు మరో నాలుగు నెలలే ఉండటంతో ఇప్పటి నుంచే రెండు పార్టీల కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్దం చేసే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించారు. త్వరలోనే రెండు పార్టీల ఉమ్మడి అజెండా రూపకల్పన చేసి జనంలోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.