జనసేనల ఆశలు ఆవిరి!
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు రాజకీయ వేదికపై కొత్త ఆవిష్కరణలకు తెరతీశాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనపార్టీ ఆశలు ఆవిరయ్యాయి. భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకుని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేనపార్టీ అభ్యర్ధులకు ఒక్కచోట కూడా విజయావకాశాలు కనిపించలేదు. పార్టీ అధ్యక్షుడు సినీనటుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించినప్పటీకి కనీసం ఒక్క చోటయినా డిపాజిట్టు దక్కించలేకపోయారు.
కనీసం సెట్లర్స్ ఓట్లు అధికంగా ఉన్నారని భావించే కూకట్‌పల్లి నియోజకవర్గంలోనైనా విజయంపై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ అధినేతకు అక్కడ కూడా పరాయజం తప్పలేదు.ఈ ఎన్నికల్లో సినీగ్లామర్ ఏ మాత్రం పనిచేయలేదు. పార్టీ సభలకు రోడ్‌షోలకు భారీగానే జనం హాజరైనప్పటికీ ఓట్లు మాత్రం పడలేదు. ఖమ్మం, కొత్తగూడెం, వైరా , అశ్వారావుపేట, కూకట్‌పల్లి ,తాండూర్, కోదాడ, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్దులు కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. పార్టీ పరాజయం పాలవటంతో జనసేన పార్టీ ప్రాధానకార్యాలయం వెలవెలబోతోంది.