చెన్నై: ప్రముఖ సినీ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుసైని(60) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఎపి ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన శిక్షణ ఇచ్చారు. అయితే తన గురువు మృతికి పవన్‌కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న రోజులను పవన్ గుర్తు చేసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుసైని తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని పవన్ అన్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల క్రితమే తెలిసిందని.. విదేశాలకు పంపించి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్లు పవన్ పేర్కొన్నారు. ఆయన్ని కలిసేందుకు ఈ నెల 29న వెళ్లాలని అనుకున్నానని.. కానీ ఈలోపే ఇలా జరిగిపోయిందని బాధపడ్డారు.
తనకు ఎంతో నియమ నిబంధనలతో శిక్షణ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తొలుత శిక్షణ ఇచ్చేందుకు హుసైని ఒప్పుకోలేదని.. ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారనే విషయాన్ని వెల్లడించారు. తెల్లవారుజామునే వెళ్లి.. సాయంత్రం వరకూ అక్కడ శిక్షణ పొంది బ్లాక్‌బెల్ట్ సాధించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఎంతో స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారిని అన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. మరణానంతరం ఆయన దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.