యాదాద్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో మూడోవంతు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గంలో 5 వేల ఓట్లు ఉన్నాయని తెలిపారు. పవన్ వ్యాఖ్యలతో అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సామాజిక మార్పు కోసమే ‘జనసేన’ అని స్పష్టం చేశారు. పవన్ ఈ రోజు యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ మీదుగా యాదాద్రికి వెళ్తుండగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలికారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని ఓటములైనా భరిస్తామని చెప్పారు. ఆంధ్రలోనే అధికారం ఆశించలేదని… తెలంగాణలో అధికారం ఎలా ఆశిస్తానని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గెలుపు-ఓటములను జనసేన ప్రభావితం చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన జనసేన నేత సైదులు కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించి రూ.5 లక్షల భీమా చెక్కును అందజేశారు.