Wednesday, December 25, 2024

వైసిపి అవినీతి కోటలు బద్ధలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

వైసిపి అవినీతి కోటలు బద్ధలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశామని, జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతీ రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకుందన్నారు. జనసేన తరఫున విజయం సాధించిన ఎంఎల్‌ఎలు, ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ బుధవారం సమావేశమయ్యారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ నమ్మకంతో గెలిచామో వారి అంచనాలకు తగ్గట్లే పనిచేస్తామని తెనాలి నియోజవర్గం నుంచి జనసేన తరఫున ఎంఎల్‌ఎగా విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ చెప్పారు. భవిష్యత్ లో ప్రజలకు ఏ విధింగా మంచి చేయాలనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. పవన్ కల్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. ప్రజలకు మౌలిక సదుపా యాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా విజయం సాధించిన పంతం నానాజీ చెప్పారు. వైసిపిలో జగన్ తప్ప ఎవరూ ఉండరని, అందరూ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారన్నారు.

ప్రధానంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలు ఎగుమతి అవుతున్న బియ్యం రవాణపై దృష్టి సారిస్తున్నామన్నారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ విజయం అందరి సమష్టి కృషి అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఒక పార్టీ 100 శాతం విజయం దేశంలో ఎక్కడా వినలేదని అన్నారు. 21 మంది గెలుపు వెనుక 17 సంవత్సరాల అధ్యక్షుల శ్రమ దాగి ఉందని వెల్లడించారు. ఈ 17 ఏళ్లు ఆయన మానసికంగా, శారీరకంగా ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి అందర్నీ విజయపథంలోకి తీసుకువచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన వ్యక్తి అన్న నాగబాబు తమకు ఆయన నియోజకవర్గంలో పని చేసే అదృష్టం దక్కిందన్నారు. పిఠాపురంలో పని చేసిన 45 రోజులు ఎంతో నేర్చుకున్నామన్నారు. అక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు, వీర మహిళలు చూపిన ప్రేమ అద్భుతమని కొనియాడారు. ఈ ఎన్నికలు ఇద్దరే నడిపారు. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే, ఇంకొకరు సామాన్య ప్రజలన్నారు. ప్రతి ఒక్కరూ ఎర్ర కండువా మెడలో వేసుకుని పని చేశారన్నారు. ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, మనం బాధ్యతాయుతంగా పని చేస్తే 2029లో మరింత ప్రభావం చూపవచ్చన్నారు. హ్యాట్సాఫ్ టూ ప్రెసిడెంట్ హ్యాట్సాఫ్ జన సైనికులు అని నాగబాబు కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News