హైదరాబాద్: తిరుమల లడ్డూపై ఢిల్లీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పొగరుగా మాట్లాడారని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సనాతన ధర్మం జోలికి రావద్దని వైసిపి నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. శ్రీ కనక దుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకపోతే సంబంధం లేదని మౌనంగా ఉండాలని , అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. పొన్నవోలు కూడా హిందువేనని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు. తిరుమలలో లడ్డూ విషయంలో మాట్లాడితే తప్పా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నటుడు ప్రకాశ్ రాజ్ కు కూడా చెబుతున్నానని, మీరంటే తనకు గౌరవం ఉందని, సున్నిత అంశాలపై ప్రకాశ్ రాజ్ విషయం తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
అందరికీ చెబుతున్నా విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. తప్పు జరిగిందంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, లేదా మౌనంగా ఉండాలన్నారు. తప్పు చేసిన వాళ్ల నాశనం మొదలైందని, విచారణకు రావాలంటే సుబ్బారెడ్డికి రికార్డులు ఇవ్వాలటా?, వైసిపి ప్రభుత్వం ఉన్నప్పనుడు మాకు రికార్డులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఎక్కడ కనిపించడంలేదని, తిరుమలను ఇష్టారాజ్యంగా మార్చేశారని, సనాతన ధర్మంపై పోరాటం చేయగలిగితే తనని ఎవరూ ఆపలేరన్నారు.
ఈ నేల అన్ని మతాలను గౌరవిస్తుందని, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలని పవన్ కల్యాణ్ కోరారు. సనాత ధర్మం పాటించేవాళ్లు ఇతర మతాలను గౌరవిస్తారని, సగటు హిందువుకు వేరే మతం వ్యక్తిపై ద్వేషం ఉండదన్నారు. హైందవ ధర్మం కాపాడుతామని సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బాధ్యత తీసుకున్నారని, అపవిత్రం జరిగిందంటే బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని పవన్ నిలదీశారు.