హైదరాబాద్ : ఒకే కులానికి తనను పరిమితం చేయొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో బిసి నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. బిసిలంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కాదని, ఈ దేశానికి వెన్నుముక అని వ్యాఖ్యానించారు. ఒక కులం పరిధిలో తాను ఆలోచించడం లేదని, బిసిలు ఐక్యంగా ఉన్నపుడే సామాజిక న్యాయం అమలవుతుందని అన్నారు. బిసిలు అత్యధికంగా ఉండి తమ న్యాయమైన డిమాండ్లను దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఇందుకు బిసిల్లోని అనైక్యతే కారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను కేవలం కాపులకు మాత్రమే నాయకుడిని కాదని, ప్రజలందరికీ నాయకుడినని స్పష్టం చేశారు. వెనుకబడిన కులాలను భుజాలకెత్తుకోవాలని కంకణం కట్టుకున్నానని అన్నారు. ఓటు అమ్ముకోకూడదని, ఓటు కొనుక్కోకూడదని ఆయన సూచించారు. అప్పుడే బిసి, ఎస్‌సి, ఎస్‌టి సామాజిక వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణలో 26 కులాలను బిసిల జాబితా నుంచి తొలగించారని, దీనిపై బిఆర్‌ఎస్ పార్టీ స్పందించాలన్నారు. వైసిపి, టిడిపి కూడా స్పందించాలని కోరారు.