Monday, January 20, 2025

‘బ్రో’ సినిమా నవ్విస్తుంది, కంటతడి పెట్టిస్తుంది..

- Advertisement -
- Advertisement -

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” సముద్రఖని గారు చెప్పినట్లుగా, ఎంతసేపూ సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా చేసేటప్పుడు సమాజానికి ఉపయోగపడే ఎంతోకొంత చిన్నపాటి ఆలోచన ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఇది చాలా సంపూర్ణమైన సినిమా. కరోనా సమయంలో ఒకసారి ప్రముఖ దర్శకులు, మిత్రులు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు. సముద్రఖని గారి దగ్గర ఓ కథ విన్నాను, చాలా బాగుందని చెప్పారు. నాకు ఒకసారి కథ నచ్చిందంటే రచయితని గానీ, దర్శకుడిని గానీ సంపూర్ణంగా నమ్మేస్తాను. అంత నమ్మకంగా ఈ సినిమా చేశాను. సముద్రఖని గారు రాసిన కథకి త్రివిక్రమ్ గారు సరికొత్త స్క్రీన్ ప్లే అందించారు. ముఖ్యంగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన స్క్రీన్ ప్లే చాలా బాగా డెవలప్ చేశారు.

ఇది నేను కనీసం 50 నుంచి 70 రోజులు చేయాల్సిన సినిమా. నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. నేను, త్రివిక్రమ్ గారు ఎక్కువగా సాహిత్యం, సైన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అంత చదువుకొని సినిమా మీద మక్కువతో ఇక్కడికి వచ్చి అద్భుతమైన రచయితగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. నీ స్నేహితుడిని చూపించు, నువ్వు ఏంటో చెప్తాం అంటారు. నాకు త్రివిక్రమ్ గారు స్నేహితుడు అయినందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. ఆయనను గురువు స్థానంలో పెడతాను.

నేను ఈ సినిమా 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలిగాను అంటే దానికి కారణం దర్శకుడు సముద్రఖని, డీఓపీ సుజిత్ వాసుదేవ్. థమన్ తో ఇది నాకు హ్యాట్రిక్ ఫిల్మ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సినిమా సాయి తేజ్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారే సూచించారు. ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి ముందే సెట్లు రెడీ చేసి పెట్టుకొని, సరైన ప్రణాళిక చేసిన నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నవ్విస్తుంది, బాధపెడుతుంది. గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం. ఇలాంటి చక్కటి సినిమాని అందించిన సముద్రఖని గారికి కృతఙ్ఞతలు” అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News