హైదరాబాద్ : జనసేన పార్టీ ఏ రాజకీయ పార్టీ జెండా, ఎజెండాల కోసం పనిచేయదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసే ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లనివ్వనని పేర్కొన్నారు. వాస్తవిక ధోరణితో ఆలోచించి నిర్ణయాలు ఉంటాయన్నారు. నచ్చక పోతే నచ్చలేదని నిర్మోహమాటంగా చెప్తామని, లోపాయకారి ఒప్పందాలుండవని అన్నారు. జనసేన పార్టీ భవనాబలంతో నడుస్తుంది తప్ప డబ్బుతో కాదన్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించి దళితులు, బిసీలను కలుపుకొని వెళ్ళగిలిగితే రాజ్యాధికారం సిద్దిస్తుందని చెప్పారు. లేని పక్షంలో ఎన్నటికీ రాజకీయ సాధికారత సాధ్యం కాదన్నారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఖ్యాబలం ఎక్కువ ఉండి కూడా రాజ్యాధికారం చేజిక్కించుకోలేని కులాల్లో కాపు, తెలిగ, బలిజ, ఒంటరి సమూహాలు కీలకమైనవని, ఇప్పటికి కూడా రిజర్వేషన్, ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వాలని చేయిచాచడం బాధకరమని అన్నారు. సంఖ్యాబలం ఉండి కూడా దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఒక్కసారి ఆలోచించాలని, ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాపుల్లో ఐక్యత రానంతవరకు రాజకీయ సాధికారిత సధ్యం కాదన్నారు. రామ్ మనోహర్ లోహియా కలను జనసేన సాకారం చేస్తుందని వపన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబం అనుభవిస్తున్న మైన్స్ బలిజలకు చెందినవేనని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కుటుంబం ఆ రోజు పెట్టిన హింసను తట్టుకోలేక మైన్స్ వదిలిపెట్టేశారని అన్నారు. రాయలసీమలో బలిజలు గొంతెత్తాలని కోరారు.
రాష్ట్రంలో కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడని పవన్ కళ్యాణ్ చెప్పారు. డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే అత్యుత్తమమని, లేని పక్షంలో డబ్బులు తీసుకొని జనసేనకు ఓటేయండని పిలుపునిచ్చా రు. చనిపోయాక విగ్రహాలు కాదు బతికున్నప్పుడు పక్కనుండాలని జనసేనాని సూచించారు,. వంగవీటి రంగా మీటింగ్ పెడితే 10 లక్షల మంది వచ్చారు, చనిపోయాక ఇప్పుడు రంగా పేరు పెట్టాలంటున్నారు, మనిషి బతికున్నప్పుడు ఆయనతో ఉండి ఉంటే ఆయన బతికి ఉండేవారన్నారు. కాపులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు పక్కనున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ధక్షిణ భారత దేశమంతటా ఉన్నారని వీరు కనుక బిసిలు, దళితులను కలుపుకొని వెళ్ళగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ లేదని పవన్ పేర్కొన్నారు.
జనసేనలోకి ఇద్దరు మాజీ ఎంఎల్‌ఎలు
ఇద్దరు మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒంగోలు మాజీ ఎంఎల్‌ఎ, ప్రకాశం జిల్లా మాజీ జెడ్‌పి చైర్మన్ ఈదర హరిబాబు, పశ్నిమగోదావరి జిల్లా కొవ్యూరు మాజీ ఎంఎల్‌ఎ టివి రామారావు తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. రామారావు వైసిపికి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కల్పి సాదరంగా ఆహ్వానించారు.
వీరితో పాటు భీమిలీ నియోజకవర్గానికి చెందిన వైసిపి కీలక నేతలు చందర్ రావు, అక్కరమాని దివాకర్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, భీమిలి ఇంచార్జ్ పంచర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.