Sunday, December 22, 2024

సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది రైటే: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు రూ.1 కోటి, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున విరాళం
ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సహాయం
వరద బాధితులకు రూ.120 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో

మన తెలంగాణ/అమరావతి: ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. హైదరాబాదులో అక్రమ నిర్మాణాల అంతు తేల్చుతున్న ఈ వ్యవస్థ, కబ్జాదారుల పాలిట సింహస్వప్నంలా మారింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడుతూ హైడ్రా ప్రస్తావన తీసుకువచ్చారు. ‘బుడమేరు పరీవాహక ప్రాంతం అంతా ఇళ్లు కట్టేశారు. ఈ విషయంలో సంబంధింత యంత్రాంగానికి, మున్సిపాలిటీకి, పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది. హైడ్రా వంటి వ్యవస్థను తీసుకువచ్చి వీటన్నింటినీ తొలగించవచ్చు.

కానీ కొన్ని సమస్యలు వస్తాయి. హైదరాబాద్ లో చెరువులు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టడం చూశాను. ఇబ్బందులు రావా అనుకునేవాడ్ని! అన్నీ కట్టేసిన తర్వాత కూల్చేయడం కాదు. ఇలాంటి వాటిని ముందే నివారించేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అధికారులు వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక అక్రమ నిర్మాణాలను కూలగొట్టేస్తామంటున్నారు. ఆయన చేస్తున్నది రైటే. అయితే మనం కూడా ఇలాగే వ్యవహరించాలంటే అనేక సామాజిక సమస్యలు, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ వివరించారు.

వరద బాధితులకు మొత్తంగా రూ.6 కోట్లు విరాళం: తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కోటి రూపాయలు ఇస్తానన్నారు. అలాగే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.1 కోటి ఇస్తానని ప్రకటించారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. వరద బాధితులకు మొత్తంగా రూ.6 కోట్లు ఇస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున జస్టిస్ ఎన్వీ రమణ సహాయం: రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందచేశారు. ఢిల్లీ లో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు ఈ మేరకు బుధవారం చెక్కులు అందచేశారు. కష్ట కాలంలో మనకు చేతనైనంత సాయం చేయాలని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు నిచ్చారు. సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలన్నారు. ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలవాల్సిసిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాలని ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నానన్నారు.

తెలుగు రాష్ట్రాలకు భువనేశ్వరి రూ.2 కోట్ల విరాళం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలని, సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మనం వారికి చేసే అతిపెద్ద సాయమన్నారు. తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాల మీద ప్రభావం చూపించాయని, అందుకే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించడం జరిగిందని, వరద ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని భువనేశ్వరి చెప్పారు.

రూ.120 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో: ఏపీ ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ఇచ్చారు. ఎపీ ఎన్జీవో జేఏసీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.120 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు ఏపీ ఎన్జీవో నేతలు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును నాయుడును కలిసి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో జేఏసీని అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వరకు ముందుకు వస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News