పవన్ కళ్యాణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూ పొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎపి డిప్యూటీ పిఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ ఎంఎల్‌ఎ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈవెంట్లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘శంకర్ చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ ఒకరు. తమిళంలో శంకర్ సినిమాలు తీసి తెలుగు వారినీ మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గో దారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు.
సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, శిరీష్ లకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. రామ్ చరణ్ మా బంగారం.. నా తమ్ముడులాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘సినిమాలో నేను గేమ్ చేంజర్ని కావొచ్చు. కానీ ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ రియల్ గేమ్ చేంజర్.
పవన్ కళ్యాణ్ లాంటి వారిని చూసే శంకర్ ఇలాంటి పాత్రలని రాసి ఉంటారు‘అని తెలిపారు. శంకర్ మాట్లాడుతూ ‘నా ఇన్నేళ్ల కెరీర్లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు. అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు. ఎలాగైనా ఓ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు, రామ్ చరణ్ లకు థాంక్స్. తెలుగు లొకేషన్లలోనే షూట్ చేశాం. మినిస్టర్, కలెక్టర్కు జరిగే వార్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ తన పాత్రల్లో జీవించేశారు. ఎంతో సహజంగా నటించారు‘అని పేర్కొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ..‘రామ్ చరణ్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారు. చరణ్ నటన అద్భుతంగా ఉండబోతోంది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, తమన్, అంజలి తదితరులు పాల్గొన్నారు.