అమరావతి: పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు ఇస్తామని, భూములు అమ్మాలని చెప్పి బాధితుల వద్ద లాక్కున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఇష్టం లేకున్న భూముల అమ్మాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గతంలో పెట్రోల్ బాంబులు వేసి భయపెట్టారని, కోడెల శివప్రసాద రావును వేధించి చంపేశారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచవరం మండల వేమవరం, చెన్నాయపాలెయంలో సరస్వతి భూములను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన 24 ఎకరాల భూములను భయపెట్టి తీసుకున్నారని, లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయని, ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
భూమలు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేశారని విమర్శలు గుప్పించారు. 30 ఏళ్లకు తీసుకొని 50 ఏళ్లకు పెంచేశారని, 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నారని, భూములు లాక్కొని సొంత ఆస్తిలా ఇప్పుడు కొట్టుకుంటున్నారని, సహజ వనరులు అనేది ఒకరి సొత్తు కాదని, సహజ వనరులు తీసుకుంటే ఉద్యోగాలు ఎందుకు కల్పించడంలేదని ప్రశ్నించారు. నిర్మించని సిమెంటు కంపెనీకి 196 కోట్ల లీటర్ల నీరు ఎందుకు అని అడిగారు. పేదలనే బెదిరించి భూములను లాక్కుంటే పోలీసు అధికారులు మెత్తబడ్డారా?.. భయపడుతున్నారా? అని నిలదీశారు. గత ప్రభుత్వం ఇక్కడి వారిని భయపడితే ఎలా ఊరుకున్నారని పోలీసులను పవన్ కల్యాణ్ అడిగారు. పెట్రోల్, నాటు బాంబు వేసి బెదిరిస్తే పోలీసులు ఏం చేస్తున్నారని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. రౌడీయిజం అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని, ఇంకా తమ ప్రభుత్వమే ఉన్నట్లు వైసిపి నేతలు ప్రవర్తిస్తున్నారని, శాంతిభద్రతలు ఎంత బలంగా ఉంటాయో వాళ్లకు చూపించాలన్నారు. పవన్ కల్యాణ్ వెంట ఎంఎల్ఎ యరపతి నేని, కలెక్టర్, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.