గ్రేటర్‌లో 120 థియేటర్లలో రేపు విడుదల
యేడాది తరువాత పెద్దహీరో సినిమా
ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానులు బారులు
వారం రోజులు థియేటర్లన్నీ హౌస్‌ఫుల్… సీట్ల మధ్య గ్యాప్ లేకుండా విక్రయాలు
పవన్‌కల్యాణ్ అభిమానులను కట్టడిచేసేదెవరు
నిబంధనలు పాటించకపోతే కరోనా ఉగ్రరూపమే
హైదరాబాద్: కరోనా మహామ్మారి కారణంగా యేడాది తరువాత పెద్ద హీరో సినిమా…అసలే పవన్‌కల్యాణ్ సినిమా విడుదల….ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులు ఇది నిజంగా పండగే.అయితే…కరోనా మళ్లీ తిరగబడుతున్న సమయంలో….కేసులు భారీగా విజృంభిస్తున్న తరుణంలో పవన్‌కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమా శుక్రవారం(నేడు) విడుదలవుతుండటంతో ఓవైపు అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతోన్న గ్రేటర్‌వాసుల్లో మాత్రం వణుకు పుడుతోంది. ఇప్పటికే గ్రేటర్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో థియేటర్లలో కరోనా నిబంధనలు కనీసం అమలు చేయడంలేదన్న విమర్శల నేపథ్యంలో పవన్‌కల్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా విడుదల కానుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్‌లో పరిధిలోని 120 మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో వకీల్‌సాబ్ విడుదల అవుతోంది.
ఇప్పటికే సినిమాకు సంబంధించి టిక్కెట్లు వారం వరకు ఆన్‌లైన్‌లోనే అమ్ముడుపోయినట్లు….అన్నిథియేటర్లలో ఇందుకు సంబంధించి హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా మహామ్మారి నుంచి మెల్లిమెల్లిగా కోలుకున్న తరువాత సినిమా థియేటర్లను కొన్ని నిబంధనలతో కూడిన షరతులతో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. సీటుకు సీటుకు మద్య ఖాళీ(గ్యాప్) ఉంచి ఇప్పటివరకు చిత్రాలను నడిపించారు. కాగా, సుధీర్ఘ విరామం తరువాత పెద్ద హీరో, భారీ బడ్జెట్‌తో కూడిన వకీల్ సాబ్ చిత్రం విడుదల అవుతుండటం….సీటుకు సీటుకు గ్యాప్ లేకుండా 100 శాతం టిక్కెట్లను విక్రయించి సినిమాను విడుదల చేస్తుండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. పవన్‌కల్యాణ్ సినిమా కోసం ఇప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటం….అభిమానులను థియేటర్ల వద్ద కట్టడిచేసే అవకాశం ఏమాత్రం లేకపోవడం….థియేటర్లలో కనీస నిబంధనలు పాటించకపోవడంతో ప్రస్తుతం కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో వకీల్‌సాబ్ సినిమా అందరినీ బెంబేలెత్తిస్తోంది.
థియేటర్లలో హీరో పవన్‌కల్యాణ్ కనిపిస్తేనే అభిమానుల్లో పూనకాలు వచ్చినట్లు నృత్యాలు, పెద్ద ఎత్తున అరుపులు చేస్తుండటం సహజం…..ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే పునరావృతం అయితే…కరోనా మరింత విజృంభించే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికార,పోలీసు యంత్రాంగాలు అప్రమత్తమై థియేటర్లలో నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని, లేదంటే కరోనా విలయతాండం చేయడం ఖాయమని పెదవి విరుస్తున్నారు.