Thursday, December 19, 2024

చిరంజీవి ఇంటికి పవన్‌కల్యాణ్

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో గురువారం మెగాస్టార చిరంజీవి నివాసానికి వెళ్లారు. అగ్ర కథానాయకుడు, తన సోదరుడైన చిరంజీవిని కలిశారు. దిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్ వచ్చిన పవన్, భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలతో కలిసి నేరుగా చిరు నివాసానికి వెళ్లారు. తల్లి అంజనా దేవి వారికి గుమ్మడి కాయతో దిష్టి తీయగా, పవన్ వదినలిద్దరూ నీరాజనాలు ఇస్తూ వారిని లోపలికి ఆహ్వానించారు. పవన్ చిరు ఇంటికి వస్తున్నట్టు ముందుగానే సమాచారం చేరవేయటంతో ఈ విజయోత్సవంలో భాగం అయ్యేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ అప్పటికే చిరు ఇంటికి చేరుకున్నారు. అన్నయ్య చిరంజీవి తనవద్దకు రాగానే రాగానే పవన్ కల్యాణ్ నేరుగా ఆయన కాళ్లకు నమస్కారం చేయగా, పవన్‌ను పైకి లేపి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఆపై చిరు పైకి ఎగిరి మరీ పవన్‌కు భారీ పూలదండను వేయగా మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ’కల్యాణ్ బాబు హ్యాట్సాఫ్’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేసి పవన్ తన కుటుంబసభ్యులకు తినిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా మెగాస్టార్ ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ మెగాకుటుంబసభ్యులందరితో కలిసి చాలాసేపు గడిపారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ,పరామర్శిస్తూ మెగాఇంట్లో ఆనందం నింపారు.

నా హృదయం ఉప్పొంగుతోంది :
ఏపీ ఎన్నికల్లో పవన్ విజయం సాధించడంపై సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఇప్పటికే ఆనందం వ్యక్తం చేశారు. పవన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ కల్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా, అది ప్రజలను గెలిపించడానికే అని నిరూపించావ్. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల సంక్షేమం కోసం, నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు‘ అని పోస్టు పెట్టారు. చిరంజీవి సోషల్ మీడియా ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో కేరింతలు కొట్టించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News