జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంగడిలో సరుకని, ప్యాకేజీ స్టార్‌ని ఎవరైనా కొనుక్కోవచ్చని మరోసారి మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నేను మంచి చేస్తేనే ఓటు వేయమన్న ముఖ్యమంత్రి జగన్ తప్ప మరెవరూ లేరని పేర్కొన్నారు. సిఎం జగన్, బిసిలకు పిలిచి పదవులు ఇస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్.. అంగట్లో అమ్మడుపోవడానికి సిద్ధంగా ఉన్న సరుకు అని, ఎవరు కావాలంటే వారు కొనుక్కోవచ్చని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను బిజెపి వాళ్లు కొనుక్కోవచ్చు, తెలుగుదేశం వాళ్లు కొనుక్కోవచ్చు, ఆ మధ్య బీఆర్ఎస్ కూడా బేరం ఆడిందట అని అంబటి సెటైర్లు వేశారు.
పవన్‌ను కొనుక్కుని.. ఆయన భుజాలపై ఎక్కి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎన్నికలకు రావాలని అనుకుంటున్నారని ఆరోపించారు. సత్తెనపల్లిలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అంబటి ధీమా వ్యక్తం చేశారు. ఇక, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి పట్టిన శని అని, టిడిపి వాళ్ళు అది తెలుసుకోవాలని అన్నారు. కాగా, పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంబటిపై జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.