Thursday, January 23, 2025

మోడీతో పవార్ భేటీ!

- Advertisement -
- Advertisement -

Russia Ukraine War live updates నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌కు దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానముంది. పార్టీలకతీతంగా అందరి మన్ననలను పొందగలిగే స్థాయికి ఆయన ఎదిగారు. అటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వేసే అడుగుల వెనుక గల వ్యూహం చర్చనీయాంశం కావడం సహజం. శరద్ పవార్ మొన్న బుధవారం నాడు పార్లమెంటులో ప్రధాని మోడీని కలుసుకున్నారు. వారిద్దరి మధ్య 20 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. అంతకు ముందు రోజు శివసేన నాయకుడు, ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకుడు సంజయ్ రౌత్ భార్యకు చెందిన రూ. 11.5 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఇడి) జప్తు చేసింది. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేశారు. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఈ అరెస్టు జరిగింది.

ప్రధానితో సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ గురించి తాను మోడీకి వివరించినట్టు చెప్పారు. ఆయన భార్య ఆస్తులను ఇడి అన్యాయంగా జప్తు చేసిందని పవార్ అన్నారు. సంజయ్ కేవలం రాజ్యసభ సభ్యుడే కాదని, జర్నలిస్టు కూడానని ప్రధాని మోడీకి తాను చెప్పినట్టు వెల్లడించారు. శివసేన మహారాష్ట్ర పాలక కూటమి ఎంవిఎ (మహా వికాస్ అఘాది) లో భాగస్వామి. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నాయకత్వంలో ఏర్పడిన పాలక కూటమిలో శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీ భాగస్వాములుగా చేరాయి. ఈ కూటమి పాలనకు ఆదిలో ఎదురైన సవాళ్లను పారదోలడంలో శరద్ పవార్ కీలక పాత్ర వహించారు. అప్పటి నుంచి ఆ కూటమికి ఆయన అభయ హస్తంగా కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే రాజకీయంగా తమకు బొత్తిగా గిట్టని భారతీయ జనతా పార్టీ అధినేతలతో శరద్ పవార్ చనువుగా మెసలడం వెనుక గల వ్యూహం ఏమిటనేది కీలకమైన ప్రశ్న.

గత మంగళవారం నాడు సాయంత్రం ఢిల్లీలో శరద్ పవార్ ఇచ్చిన ఒక విందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి వెళ్లడం కూడా సందేహాలను కలిగించింది. మీడియాతో సమావేశంలో ఈ విషయాన్ని సైతం పవార్ ప్రస్తావించారు. ఆ రోజు తాను పార్లమెంటులో నిర్వహించిన ఒక శిక్షణా కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చి ఢిల్లీలో వున్న మహారాష్ట్ర ఎంఎల్‌ఎల కోసం ఆ విందును ఏర్పాటు చేశానని వారిలో చాలా మందికి రోడ్లకు సంబంధించి గల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తేవడానికి గడ్కరీని ఆహ్వానించానని శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్ర శాసన మండలికి నామినేటెడ్ సభ్యుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం పంపించిన ఫైలు గవర్నర్ భగత్ సింగ్ కోషియారి వద్ద పెండింగ్‌లో వున్న విషయాన్ని కూడా పవార్ మీడియాతో భేటీలో ప్రస్తావించారు. 2024 లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నదే. దేశమంతటా ఉనికి వున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసి ఘోరంగా ఓడిపోతున్నది.

పార్లమెంటులోనే కాకుండా అసెంబ్లీలలోనూ దాని బలం పలచబడిపోతున్నది. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసి ఆ రాష్ట్రంలో అధికారాన్ని కూడా కోల్పోయింది. ఇలా రోజురోజుకీ బలహీనపడిపోతున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో బిజెపికి సరైన పోటీ ఇవ్వలేకపోతుందనే అభిప్రాయం గట్టిపడుతున్నది. దానిని విడిచిపెట్టి దేశంలోని ప్రాంతీయ పక్షాలన్నీ ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటై బిజెపిని గద్దె దించడానికి బలమైన పోటీని ఇవ్వాలనే ఆలోచన గత కొంత కాలంగా వెల్లడవుతూనే వుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కూటమికి నాయకత్వం వహించాలని తహతహలాడుతున్న సంగతి విదితమే. శరద్ పవార్ కూడా ఇటువంటి జాతీయ కూటమిని పోగు చేసే కృషిలో పాలు పంచుకుంటున్నారు. ఇది ఇంకా గట్టిగా ఒక రూపు సంతరించుకొని ప్రజల ముందుకు రావలసి వున్నది. కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటయ్యే కూటమి వల్ల బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఒక్క చోటికి చేరి దానిని ఓడించడం సులభమవుతుందనే అభిప్రాయం వుంది.

జాతీయ స్థాయిలో ముఖ్యపాత్ర వహించి దేశానికి నూతన దిశానిర్దేశం చేయాలన్న ఆకాంక్ష వున్న నాయకులు ప్రాంతీయ పార్టీలలోనూ వున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాంగ్రెసేతర కూటమికి సారథ్యం వహించాలన్న కోరిక ఆయనకు లేకపోలేదు. ప్రాంతీయ పక్షాల కూటమి ఒక వైపు, కాంగ్రెస్ ఒక వైపు నిలబడి లోక్‌సభ ఎన్నికల పోరు సాగిస్తే అది తిరిగి బిజెపి అధికారంలోకి రావడానికే తోడ్పడుతుందనే అభిప్రాయముంది. ఈ త్రిభుజాకార జాతీయ పోరాటానికి శరద్ పవార్ తోడ్పడుతున్నారనే అంచనాలు ఏమవుతాయో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News