Monday, December 23, 2024

పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం: మదర్ డెయిరీ చైర్మన్

- Advertisement -
- Advertisement -

ఈ నెలాఖరులోగా పాడి రైతుల బిల్లులన్నీ చెల్లిస్తాం
మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి

Pay all the bills of dairy farmers

మన తెలంగాణ/మోత్కూరు: మదర్ డెయిరీకి పాలు పోస్తున్న రైతులందరికీ ఈ నెలాఖరులోగా బకాయి ఉన్న బిల్లులన్నింటిని పూర్తిగా చెల్లిస్తామని మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తెలిపారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థ అప్పుల్లో ఉన్నా రైతుల సంక్షేమం కోసం రాజీ పడకుండా పని చేస్తున్నామని, పాడి రైతులకిచ్చే రూ.4 ఇన్సెంటివ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. పాలశీతలీకరణ కేంద్రం స్థలంలో 15 షట్టర్లతో భువనగిరి రోడ్డుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించామని ఒక్కో షట్టర్ ను 13 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్ల పొడవుతో నిర్మించేందుకు రూ.4 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు.

సంస్థ అప్పుల్లో ఉండి నిధులు లేనందున కాంప్లెక్స్ నిర్మాణం కోసం షట్టర్లు అద్దెకు తీసుకునే ఆశావహుల నుంచి ముందస్తుగానే నిధులు సేకరించాలన్న లక్ష్యంతో విధి విధానాలు రూపొందించి మదర్ డెయిరీ నుంచి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అద్దెకు షట్టర్లు కావాల్సిన వారు ఒక్కో షట్టర్‌కు రూ.4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేలా పది సంవత్సరాల అగ్రిమెంట్‌తో వారం, పది రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని, రూ.5 వేల డిపాజిట్ చెల్లించి ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చని, వచ్చిన దరఖాస్తులను డ్రా తీసి 15 మందిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రెండు, మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి 15 మందికి షట్టర్లను డ్రా ద్వారా సీరియల్ ప్రకారం కేటాయిస్తామని, ఆ సందర్భంగానే ఒక్కో షట్టర్ నెల కిరాయి ఎంత అన్నది నిర్ణయిస్తామని క్రిష్ణారెడ్డి వివరించారు. ఈ కార్యచరణ మొత్తం మదర్ డెయిరీ ఎండి పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ ఎండి వి.అశోక్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ ఎస్.భాస్కర్, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్‌రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, దాసరి తిరుమలేష్, దామరోజు శ్రీకాంత్‌చారి, కొత్తకొండ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News