Monday, November 18, 2024

వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలి: కూర రఘోత్తం రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఈనెల 30వ తేదీతో మొదటి వేతన సవరణ కాలపరిమితి ముగియనుండటంతో జూలై 1వ తేదీ నుండి నూతన పే స్కేలు రూపొందించి అమల్లోకి వచ్చేవిధంగా పి.ఆర్.సి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ ఎంఎల్‌సి కూర రఘోత్తం రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు మంగళవారం నూతన సచివాలయంలో పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు తదితరులతో కలిసి ఎంఎల్‌సి కూర రఘోత్తం రెడ్డి సిఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సిఎం కెసిఆర్ 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో పి.ఆర్.సి జాప్యం లేకుండా వచ్చే నెల ఒకటవ తేదీ నుంచే అమల్లోకి వచ్చేవిధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా వెంటనే ప్రత్యేక కార్మికులను నియమించాలని సిఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని సిఎస్ పిఆర్‌టియుటిఎస్ నేతలకు హామీ ఇచ్చారు. సిఎస్‌ను కలిసిన వారిలో పిఆర్‌టియుటిఎస్ సంఘ బాధ్యులు దామోదర్ రెడ్డి, శశిధర్ శర్మ, ఆనంద్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజగంగారెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News