ట్రాన్స్‌కో,జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుకు విజ్ఞప్తి చేసిన తెలంగాణ విద్యుత్ జేఏసి
హైదరాబాద్: సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ స్టేట్ వపర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిఎస్‌పిఇజెఏసీ ) ఛైర్మన్, కన్వీనర్‌లు జి.సాయిబాబు, రత్నాకర్‌లు ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం నుంచి వేతనాలు జాప్యం కావడంతో తాము ఆర్దికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో అందక పోవడంతో ఉద్యోగులు తీసుకున్న హోమ్‌లోన్, పర్సనల్ లోన్‌లు, తదితర లోన్లన్లు సమయానికి చెల్లించలేక పోవడంతో సంబంధింత సంస్థలు డిఫాల్ట్ కింద జమ చేయడమే కాకుండా ఆదనంగా భారీ ఎత్తున ఫైన్‌లను విధిస్తున్నాయని తెలిపారు. తాము తీసుకున్న లోన్లకు సకాలంలో ఈఎంఐలను చెల్లించక పోవడంతో దాని ప్రభావం సిబిల్ స్కోర్ మీద పడుతుందని తద్వారా భవిష్యత్తులో ఏవైనా లోన్‌లు తీసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు. ఇంత వరకు జూన్,జులై నెలలకు సంబంధించిన వేతనాలు అందలేదని తెలిపారు. ఇకనైనా ,సరైన సమయానికి వేతనాలు అందే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.