దర్యాప్తునకు కర్నాటక సిఎం ఆదేశం
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫోటోతో ”పేసిఎం” పేరిట బుధవారం నగరంలో అనేక చోట్ల పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఎలెక్ట్రానిక్ వాలెట్ ”పేటిఎం”ను పోలిన విధంగా ఈ పోస్టర్లు ఉండడం గమనార్హం. ”40 శాతం ఇక్కడ ఆమోదించబడును” అన్న సందేశంతో క్యుఆర్ కోడ్ మధ్యలో బొమ్మై మొహం పోస్టర్‌లో కనిపిస్తుంది. కాగా..ఈ పోస్టర్లపై ముఖ్యమంత్రి బొమ్మై దర్యాప్తునకు ఆదేశించారు. దీన్ని నకిలీ ప్రచారమని, ఇది తన ప్రతిష్టనే కాక కర్నాటక ప్రతిష్టను సైతం దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్టను, కర్నాటక ప్రతిష్టను దెబ్బతీయడానికి ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా ఈ దుష్ప్రచారాన్ని ఆయన అభివర్ణించారు.
దీనిపై కేసును నమోదు చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారో దర్యాప్తు చేసి కనుగొంటామని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఉండగా..ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించడం, ఉద్యోగ నియామకాలలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉధృతంగా ప్రచారం సాగిస్తున్న తరుణంలో ఈ పోస్టర్లు దర్శనమివ్వడం విశేషం. ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు పొందడానికి 40 శాతం ముడుపులు చెల్లించాల్సి వస్తోందని కాంట్రాక్టర్ల సంఘం ఇటీవల ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయగా వాటిని ప్రభుత్వం ఖండించింది.