Monday, April 21, 2025

సమవుజ్జీల సమరం

- Advertisement -
- Advertisement -

నేడు పంజాబ్‌తో బెంగళూరు ఢీ

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇరు జట్లు ఈ సీజన్‌లో వరుస విజయాలతో జోరుమీదున్నాయి. ఆరేసి మ్యాచ్‌లు ఆడిన రెండు జట్లు నాలుగేసి విజయాలు తమ తమ ఖాతాలో వేసుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్ చిరస్మరణీయ విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని జయకేతనం ఎగుర వేసింది. బెంగళూరు కూడా కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జోరుమీదున్న కోహ్లి, సాల్ట్

ఈ సీజన్‌లో బెంగళూరు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లిలు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ వీరు జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. రాజాస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తించిన సాల్ట్ ఆరు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 33 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. కోహ్లి కూడా అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. దేవ్‌దుత్ పడిక్కల్ కూడా మెరుగైన బ్యటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. రజత్ పటిదార్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరిస్తున్నాడు. జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య వంటి ధాటిగా ఆడే బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే లివింగ్‌స్టోన్ పేలవమైన ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో కోహ్లి, సాల్ట్ మరోసారి శుభారంభం అందిస్తే బెంగళూరుకు భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లోనూ బెంగళూరు బాగానే ఉంది. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్, యశ్ దయాల్, కృనాల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న బెంగళూరు విజయం సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. కానీ ఈ సీజన్‌లో సొంత గడ్డపై బెంగళూరు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం అందుకోలేదు. ఈసారైనా ఆ సంప్రదాయాన్ని మారుస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

ఆత్మవిశ్వాసంతో..

కిందటి మ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుత విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బెంగళూరును కూడా ఓడించి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, నెహాల్ వధెరా వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఆర్య ఇప్పటికే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ప్రతి మ్యాచ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. కెప్టెన్ శ్రేయస్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బౌలింగ్ కూడా పంజాబ్ బాగానే ఉంది. కిందటి మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని జట్టుకు విజయం అందించారు. ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News