Wednesday, January 22, 2025

ప్రశాంతంగా ముగిసిన పిసి ప్రిలిమినరీ పరీక్ష

- Advertisement -
- Advertisement -

PC Preliminary Exam which ended peacefully

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ముగ్గురు సిపిలు
ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్ష
హైదరాబాద్‌లో 92 కేంద్రాలు
94శాతం హాజరు

హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పరీక్ష కేంద్రాలను హైదరాబాద్ సిపి సివి ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48,732 మందికి గాను 44,798 మంది అభ్యర్థులు హాజరయ్యారు, 3,934మంది గైర్హాజరయ్యారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు అభ్యర్థులు 94శాతం మంది హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలోని 17 పరీక్ష కేంద్రాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష హైదరాబాద్‌లోని 92 పరీక్ష కేంద్రాల వద్ద ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సీనియర్ పోలీసు అధికారులు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సిపి వెంట జాయింట్ సిపి రమేష్, డిసిపి సునిల్, ఉస్మానియా యూనివర్సిటీ విసి రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాచకొండలో…

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. అరోరా ఇంజనీరింగ్ కాలేజీ, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రిన్స్‌టన్ డిగ్రీ కాలేజీలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 78,571మంది అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 67,709మంది అభ్యర్థులు హాజరయ్యారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్థులు శారీరక ధారుడ్య పరీక్షపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే మెయిన్ పరీక్ష కోసం కూడా సన్నద్దం కావాలని తెలిపారు. సిఎఆర్ అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో శారీరదారుడ్య పరీక్షపై రాచకొండ పోలీసులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని పోలీస్ పరీక్షల అభ్యర్థులు ఉపయోగించుకోవాలని కోరారు.

కన్నీళ్లు పెట్టుకున్న అభ్యర్థులు…
నిమిషం నిబంధన ఉండడంతో చాలామంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. దీంతో చాలామంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను గేట్ల వద్దే ఆపివేయడంతో నిరాశగా వెనుతిరిగారు. అధికారులను ఎంతబతిమాలినా లోపలికి పంపించకపోవడంతో, ఇన్ని రోజులు కష్టపడి చదివింది వృథా అయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News