వచ్చే ఏడాది పాకిస్థాన్ గడ్డపై జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ నెలకొంది. ఈ ట్రోఫి నిర్వాహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాకిచ్చింది. టీమిండియా పాకిస్థాన్ లో పర్యటించే ప్రసక్తే లేదని బీసీసీఐ ఐసిసికి తేల్చి చెప్పింది. దీంతో భారత్ మ్యాచ్ లను హైబ్రిడ్ పద్దతిలో దుబాయ్, యూఏఈలో నిర్వహించాలని పాక్ ను ఐసిసి కోరింది. అయితే, అందుకు పాక్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు.పాక్ లోనే మెగా ట్రోఫీని నిర్వహిస్తామని పట్టుబట్టింది. దీంతో ఐసిసి సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది.
హైబ్రిడ్ పద్దతికి అంగీకరించకపోతే ఆతిథ్య హక్కులను ఇతర దేశాలకు ఇస్తామని హెచ్చరించిన్లు సమాచారం. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రోఫీ నిర్వాహణ హక్కులు కోల్పోతే పాకిస్తాన్ కు ఆర్థికంగా తీవ్ర నష్టమేనంటూ క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. హైబ్రిడ్‌కు అంగీకరిస్తే సాయంత్రం 4 గంటలకు పీసీబీతో ఐసీసీ భేటీ కానున్నట్లు సమాచారం. లేకపోతే పాక్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు.