మరిపెడ: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తొర్రూర్ డిఎస్‌పి ఏ. రఘు హెచ్చరించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించిన వివరాలను సిఐ ఎన్. సాగర్, మరిపెడ మండల వ్యవసాయ శాఖ అధికారి వీరాసింగ్‌తో కలిసి వెల్లడించారు. మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన రేఖ సురేష్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివ కుమార్‌లు నకిలీ పత్తి విత్తనాలు ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో విక్రయిస్తున్నారన్నా సమాచారం మేరకు మరిపెడ ఎస్‌ఐ దూలం పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి సోమవారం రేఖ సురేష్‌కు చెందిన వ్యవసాయ భూమి వద్ద తనిఖీలు నిర్వహించగా రెండు బస్తాలలో అరుణోదయ సీడ్స్ అనే పేరుతో ఉన్న 90 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను పట్టుకున్నట్లు తెలిపారు.
దీని విలువ సుమారు రూ. లక్షా 35 వేలు ఉంటుందన్నారు. నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న నిందితుల్లో సురేష్‌ను అరెస్ట్ చేయగా శివకుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పత్తి కొనుగోలుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు అనుమానం కలిగితే 100కు సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా అక్రమ వ్యాపారాలు చేస్తే అట్టి వారిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ దూలం పవన్‌కుమార్, సిబ్బంది క్రాంత్రి కుమార్, డ్రైవర్ సందీప్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మొగిలి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.