ఆదేశాలు జారీ చేసిన సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ కేంద్రంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లపై పిడి యాక్ట్ పెడుతూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా, దేవరకొండ, మల్లేపల్లికి చెందిన నేనావత్ కృష్ణ, నేనావత్ హరి, నేనావత్ అశోక్, రామావత్ రోహిత్, రామావత్ కిరణ్ బంధువులు. అందరు హైదరాబాద్‌లో ఉంటూ అద్దె కార్లను నడుపుతున్నారు. 2019లో నేనావత్ కృష్ణ గంజాయి రవాణా చేస్తుండడంతో రాజమండ్రి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో పేరుమోసిన గంజాయి స్మగ్లర్ బోడ హతిరాంతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత హతిరామ్, కృష్ణకు మరో గంజాయి స్మగ్లర్ బాలును పరిచయం చేశాడు. అప్పటి నుంచి గంజాయిని ఏజెన్సీ ఏరియా నుంచి మహారాష్ట్ర, కర్నాటకకు తరలిస్తున్నాడు. దీనికి గాను తన బంధువులను కూడా ఇందులోకి దింపి హైదరాబాద్ నుంచి ఆయా రాష్ట్రాలకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, 2022న హైదరాబాద్, బెంగళూరు, ముంబాయికి గంజాయిని రవాణా చేస్తుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.