ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
హైదరాబాద్: వివిధ పేరు మోసిన కంపెనీల నకిలీ వెబ్సైట్లను సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్ రాష్ట్రం, నవాడా జిల్లా, కాశీచాక్ పిఎస్, లాల్బిగా మండల్‌కు చెందిన కమల్‌కాంత్ విద్యార్థి అలియాస్ టింకు వ్యాపారం చేస్తున్నాడు. జార్ఖండ్, నాకా, లక్నో జిల్లా,డుగువాన్కు చెందిన ఉత్కర్శ్ సింగ్ ఇద్దరు కలిసి నకిలీ వైబ్సైట్లు సృష్టిస్తున్నారు. ఉత్కర్శ్ సింగ్ వెబ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. కమాల్కాంత్ విద్యార్థి అలియాస్ టింకు ప్రముఖ కంపెనీల వెబ్సైట్లను వాటిని పోలిన విధంగా తయారు చేసి ఫేస్బుక్, గూగుల్‌లో యాడ్స్ ఇస్తూ మోసం చేస్తున్నారు.
వీటి ద్వారా రుణాలు ఇస్తామని, టవర్లు ఇన్స్టాల్ చేస్తామని, ఫ్రాంచైజీలు ఇస్తామని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు కలిసి 26 నకిలీ వెబ్సైట్లను తయారు చేసి మోసం చేశారు. మెడిప్లస్, బజాజ్ ఫైనాన్స్ తదితర వెబ్సైట్లను సృష్టించారు. ఇవి నిజమైన వెబ్ సైట్లకు చాలా దగ్గరగా ఉంటాయి. యాడ్స్‌ను చూసి నమ్మిన వారిని రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇద్దరు నిందితులు 2020 నుంచి 2021 మధ్యలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు నేరాలు చేశారు. వీరిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఈ నెల 9వ తేదీన అరెస్టు చేశారు. తాజాగా వారిపై పిడి యాక్ట్ పెడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
PD Act on two cheating with fake websites