నూతన ప్రభుత్వంతోనే సంప్రదింపులు : షరతులు విధించిన తాలిబన్లు
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో శాంతి ఒప్పందానికి తాలిబన్లు మెలిక పెట్టారు. ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడు అశ్రఫ్‌ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాల్సిందేనని తాలిబన్లు షరతు విధించారు. నూతన ప్రభుత్వం ఏర్పడితేనే తాము సంప్రదింపులకు సిద్ధమని తెలిపారు. అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. తాలిబన్ల సంప్రదింపుల బృందంలో షహీన్ సభ్యుడిగా ఉన్నారు. తాము ఆఫ్ఘన్‌పై ఏకఛత్రాధిపత్యం చేయాలని అనుకోవడంలేదని షహీన్ అన్నారు. గతంలో తమ ప్రభుత్వంసహా ఏ ప్రభుత్వమూ అలాంటి ధోరణితో వ్యవహరించడం వల్ల విజయవంతం కాలేదన్నారు. అయితే, తమతో సంప్రదింపులు జరపాలంటే నూతన ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందేనని, ఘనీ దిగిపోవాల్సిందేనని షరతు విధించారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా,నాటో దళాలు వెనక్కి వెళ్లడం దాదాపు పూర్తి కావొస్తోంది. ఆగస్టు 31ని తుది గడువుగా నిర్ణయించుకున్న దళాలు ఇప్పటికే 95 శాతం వెనక్కి వెళ్లాయి. దాంతో, ఆఫ్ఘన్‌లో తాలిబన్లకు తిరుగులేదన్న అభిప్రాయం ఏర్పడింది. పలు రాష్ట్రాలు వారి స్వాధీనంలోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి.
తాలిబన్లు వ్యూహాత్మకంగా ముందుకు కదిలారని అమెరికా సైనికాధికారి ఇటీవల పెంటగాన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఆ దేశాన్ని తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకోగలరన్న దానిని కాదనలేమని కూడా అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల అవగాహన ఉండే సైనికాధికారి నుంచే అలాంటి వ్యాఖ్యలు రావడంతో ఆఫ్ఘన్ పట్ల సర్వత్రా ఆందోళన నెలకొన్నది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్లూటిసి) జంట భవనాలు, పెంటగాన్ భవనంపై అల్‌ఖైదా జరిపిన ఆత్మాహుతి దాడి అనంతరం ఆఫ్ఘన్ పరిస్థితి మారిపోయిన విషయం తెలిసిందే. అప్పటివరకూ అక్కడ అధికారంలో ఉన్న తాలిబన్లే అల్‌ఖైదాను పెంచి పోషించారన్న నిజం తెలుసుకున్న అమెరికా ఆ దేశంపై భీకర దాడులకు దిగింది. తాలిబన్లను అణచివేసి, తమకు అనుకూల ప్రభుత్వాల్ని అక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చింది. చివరికి అదే తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందాలకు మొగ్గు చూపడం గమనార్హం.