Sunday, December 22, 2024

సీమాంతర చొరబాట్లు ఆగితేనే బెంగాల్‌లో శాంతి స్థాపన

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
2026 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో మార్పు తేవాలి
రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి

కోల్‌కతా : సీమాంతర చొరబాట్లు ఆగినప్పుడే పశ్చిమ బెంగాల్‌లో శాంతి నెలకొంటుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉద్ఘాటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో మార్పు తీసుకురావలసిందిగా రాష్ట్ర ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పెట్రపోల్ ల్యాండ్ పోర్ట్‌లో కొత్త ప్రయాణికుల టెర్మినల్ భవనానికి, ‘మైత్రీ ద్వార్’ కార్గో గేట్‌కు అమిత్ షా ప్రారంభోత్సవం చేస్తూ, పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని తెలియజేశారు. ‘2026లో పశ్చిమ బెంగాల్‌లో మార్పు తీసుకురండి. (మేము)చొరబాట్లకు అంతం చేసి, రాష్ట్రంలో శాంతి స్థాపనను సాధ్యం చేస్తాం’ అని అమిత్ షా చెప్పారు.

‘ఈ ప్రాంతంలో శాంతి స్థాపనలో భూ రేవులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. సరిహద్దు ఆవలి నుంచి ప్రజల చట్టబద్ధమైన సంచారానికి అవకాశం లేని చోట అక్రమ సంచార పద్ధతులు తలెత్తుతాయి. అది దేశంలో శాంతికి విఘాతం కలిగిస్తుంది& చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్‌లో శాంతి నెలకొనగలదు’ అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అన్నారు. భూ రేవులు ఇరుగుపొరుగు దేశాల మధ్య అనుసంధానం, సంబంధాల మెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. ఈ సదుపాయాలు ఇరుగుపొరుగు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా పెంచుతాయని ఆయన సూచించారు. 2014లో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం వంటి వివిధ రంగాలోల ప్రధాని అనేక పథకాలు ప్రారంభించారని అమిత్ షా తెలియజేశారు.

‘కానీ ఆరోగ్య రంగంలో కల్పిస్తున్న ప్రయోజనాలు బెంగాల్ ప్రజలకు అందడం లేదు. ఈ లోటు 2026 నుంచి తీరగలదు’ అని ఆయన చెప్పారు. ‘అవినీతి’ అంశంపై రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వాన్ని ఆయన తూర్పారబట్టారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం పంపిన నిధుల్లో అధిక భాగాన్ని రాష్ట్రంలో ‘అవినీతి కారణంగా స్వాహా చేశారు’ అని ఆయన ఆరోపించారు. ‘పశ్చిమ బెంగాల్‌లో మంచి రోజులు (అచ్ఛే దిన్) 2026 నుంచి మొదలవుతాయని అమిత్ షా జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని పెట్రపోల్‌లో ఆధునికీకరించిన భూ రేవు కేంద్రం గురించి అమిత్ షా మాట్లాడుతూ, భారత భూ రేవుల ప్రాధికార సంస్థ (ఎల్‌పిఎఐ) పొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నదని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News