వాషింగ్టన్: అఫ్ఘనిస్థాన్‌లో శాశ్వత శాంతియుత వాతావరణం రాజకీయ పరిష్కారంతోనే సాధ్యం అవుతుందని అమెరికా స్పష్టం చేసింది. తాలిబన్ల ప్రాబల్యం పెరగడం, తిరిగి అక్కడ ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో జో బైడన్ సారథ్యపు అధికార యంత్రాంగం శనివారం స్పందించింది. రాజకీయ పరిష్కారం వల్లనే అఫ్ఘన్‌కు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని దేశాధ్యక్షులు జో బైడెన్ స్పష్టం చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకి తెలిపారు. ప్రస్తుతం అక్కడ తాలిబన్లు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియకు అమెరికా తగు ప్రాధాన్యతను ఇస్తుందని , దీని వల్ల ఎటువంటి రాజకీయ పరిష్కారం కుదిరినా అది దేశానికి ప్రయోజనం కల్గిస్తుందని పేర్కొన్నారు. అక్కడ అమెరికా సుదీర్ఘ యుద్ధ పాత్ర ముగిసింది.
ఆ దేశపు అంతర్గత భద్రత సొంతంగా పరిష్కరించుకోవడం ద్వారా సహజంగానే అక్కడ శాంతి సుస్థిరతకు వీలేర్పడుతుంది. అక్కడి ప్రభుత్వం అయినా , అసమ్మతి వర్గాలు అయినా సంప్రదింపులకు దిగడాన్ని అమెరికా ప్రోత్సహిస్తుంది. అక్కడ ఏ పక్షం రాజీమార్గానికి చొరవ , ఆసక్తి చూపినా తమకు సమ్మతమే అవుతుంది. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మానవీయ సాయం, భద్రతా, శిక్షణపరమైన మద్దతు ఉంటుందని వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు. అఫ్ఘన్ నుంచి అమెరికా ఉపసంహరణ గురించి దేశ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ ఎంఎస్‌ఎన్‌బిసికి ఇంటర్వూ ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్ ఉగ్రవాద శక్తులకు శిక్షణ స్థలిని కానివ్వం, అమెరికా, మిత్రదేశాలు, భాగస్వామ్యపక్షాలపై దాడుల దిశలో ఈ దేశం వేదిక కావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.
Peace for Afghanistan with political solution